హెచ్1బీ వీసా: రెండు పదాలు మారుద్దామా?

8 Jan, 2018 20:28 IST|Sakshi

వీసా నిబంధనలపై తర్జనభర్జన కాంగ్రెస్ ఆమోదముద్ర లేకుండా కుదరదంటున్న నిపుణులు

హెచ్1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే

హెచ్1బీ వీసాదారులకు పొడిగింపును రెండుసార్లకే పరిమితం చేసేందుకు అవసరమైన చట్ట సవరణకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్)అధికారులు సిద్ధమౌతున్నారు. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డ్ వచ్చే లోగా తమకున్న హెచ్1బీ వీసాలను ఎన్నిసార్లయినా పొడిగించుకోవడానికి విదేశీ ఉద్యోగులకు వెసులుబాటు ఉంది. ఎక్కువ నైపుణ్యం ఉన్న ఇతర దేశాల సిబ్బందిని  హెచ్1బీ వీసా ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన అమెరికా రప్పించడానికి 2000 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్ (ఉభయసభలు- సెనెట్, ప్రతినిధుల సభ) అమెరికా కాంపిటీటివ్నెస్ ఇన్ ట్వెంటీఫస్ట్ సెంచరీ చట్టం చేసింది. 17 సంవత్సరాలుగా ఈ చట్టం అమల్లో ఉంది.

గ్రీన్ కార్డ్ కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా హెచ్1బీ వీసాలను ‘ఎన్నిసార్లయినా పొడిగించే ’ అవకాశం ప్రస్తుత చట్టంలో ఉంది. ‘పొడిగించే అవకాశం ఉంది’ అనే పదాలకు కొత్త భాష్యం చెప్పడానికి ఎంత వరకు వీలుంది? అనే అంశాన్ని డీహెచ్ఎస్ శాఖాధిపతులు క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతి మూడేళ్లకు హెచ్1బీ వీసాల పొడిగింపును ‘ఎన్నిసార్లయినా’కు బదులుగా రెండుసార్లకే పరిమితం చేసి లక్షలాది మంది ఈ వీసాదారులు తమంట తామే అమెరికా విడిచి పోయేలా చేయాలన్నది అంతర్గతంగా ఈ విభాగంలో చర్చ జరుగుతోంది.

చట్ట సవరణ సాధ్యమా?
ఈ మార్పులు ఎలా చేస్తారో వెల్లడించడానికి డీహెచ్ఎస్ కింద పనిచేసే అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగం సిద్ధపడడం లేదు. అమెరికా కాంపిటీటివ్నెస్ ఇన్ ట్వంటీఫస్ట్ సెంచరీ చట్టంలో సవరణ లేదా రెండు మాటలకు వేరే అర్థం చెప్పడం ద్వారా లక్ష్యం సాధించలేమని అమెరికా కార్మికుల తరఫున పోరాడుతున్న లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘తక్కువ నైపుణ్యమున్న హెచ్1బీ వీసాదారుల కారణంగా స్థానిక అమెరికన్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. చట్టంలోని రెండు పదాలు తొలగించినా ఆశించిన ఫలితం సాధించలేరు. ఈ చట్టాన్ని రద్దుచేయడం ఒక్కటే మార్గం’’ అని అమెరికా కార్మికుల తరఫున వాదించే లాయర్ జాన్ మియానో చెప్పారు. కాంగ్రెస్ ఆమోదముద్ర లేకుండా హెచ్1బీ వీసా ప్రోగ్రాంలో మార్పులు తలపెడితే భారీ సంఖ్యలో కోర్టుకెక్కుతారని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం పది లక్షల మంది వరకూ హెచ్1బీ వీసాదారులుండగా, వారిలో అత్యధికులు భారతీయులే.

కాంగ్రెస్ చట్టంలో మార్పులు కాంగ్రెసే చేయాలి!
అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టంలో మార్పులను అధ్యక్షుడు తన కార్యనిర్వాహక చర్య లేదా ఉత్తర్వు ద్వారా సాధించలేరని అమెరికా చట్టాలను అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. ‘‘హెచ్1బీ వీసాల గడువు పొడిగింపును ‘మంజూరు చేయవచ్చు’ అని పైన చెప్పిన చట్టంలోని 104(సీ) సెక్షన్లోని పదాలకు కార్యనిర్వాహక వ్యవస్థ కొత్త భాష్యం చెప్పడం ద్వారా వీసా ప్రోగ్రాంలో మార్పుతేవడం కుదిరేపని కాదు. ఒకవేళ అలా చేస్తే అమెరికా కోర్టులు ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తాయి. అంతిమంగా ప్రభుత్వానికి ఓటమి తప్పదు’’ అని చుఘ్ ఎలెల్పీ అనే న్యాయవాద సంస్థ అధిపతి నవనీత్ ఎస్ చుఘ్ చెప్పారు.

మరో పక్క అమెరికా వ్యాపారవర్గాలకు ప్రాతినిధ్యం వహించే అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఏసీసీ) కూడా ట్రంప్ సర్కారు తీసుకోనున్న చర్యలు దేశానికి మంచిది కాదని తేల్చిచెప్పింది. ‘‘ సొంతిల్లు, అమెరికా పౌరసత్వమున్న పిల్లలతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వృత్తినిపుణులను వెనక్కి పంపడం సబబుకాదు. ఈ విధానం అమెరికా వ్యాపారాలు, ఆర్థికవ్యవస్థకు హాని చేస్తుంది’’ అని ఏసీసీ ప్రతినిధి హెచ్చరించారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)

మరిన్ని వార్తలు