వైరస్‌లో మార్పులతో ప్రమాదమేమీ లేదు

27 May, 2020 04:07 IST|Sakshi

లండన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌లో ఇప్పటివరకూ నమోదైన అన్ని జన్యు ఉత్పరివర్తనాలు (జన్యువుల్లో మార్పులు) ప్రమాదకరమేమీ కాదని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల్లోని సుమారు 15 వేల మంది కోవిడ్‌–19 రోగుల నుంచి సేకరించిన వైరస్‌ జన్యువులను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్లు యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ అధ్యాపకుడు ఫ్రాంకోయిస్‌ బలాక్స్‌ తెలిపారు. జన్యు ఉత్పరివర్తనాలతో కూడిన కరోనా వైరస్‌ సాధారణమైన దానితో పోలిస్తే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందా? అన్నది తెలుసుకునేందుకు తాము ఓ వినూత్నమైన పద్ధతిని ఉపయోగించామని, ఇప్పటివరకూ నమోదైన అన్ని జన్యుమార్పులతో ఆ ప్రమాదం లేదని స్పష్టమైందని ఆయన వివరించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకూ 6,822 ఉత్పరివర్తనాలు నమోదు కాగా వీటిల్లో 272 మార్పులు పదేపదే స్వతంత్రంగా జరిగాయని, వీటిల్లో 31 మార్పులు పదిసార్లు మార్పులు చెందినట్లు గుర్తించామని ఫ్రాంకోయిస్‌ తెలిపారు. ఈ మార్పుల్లో కొన్ని నిరపాయకరమైనవని తేలినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు