పార్టీ నాయకత్వానికి మే రాజీనామా

8 Jun, 2019 04:52 IST|Sakshi

కొత్త నేతను ఎన్నుకునే వరకు ప్రధాని పదవిలో..

లండన్‌: బ్రెగ్జిట్‌ ఒప్పందంపై ఏకాభిప్రాయ సాధనకు మూడేళ్ల పాటు అటు ప్రతిపక్షాలతో ఇటు సొంత పార్టీలోని అసమ్మతివాదులతో పోరాడి ఓడిన బ్రిటన్‌ ప్రధాని థెరీసా మే గతంలో (మే 23న) చెప్పిన ప్రకారం శుక్రవారం కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. కొత్త ప్రధాని వచ్చేంత వరకు ఆమె తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు. కన్జర్వేటివ్‌ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ సోమవారం మొదలుకానుంది. బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని అమలు పరచలేకపోయానన్న బాధ ఎప్పటికీ ఉంటుందని మే 23వ తేదీన చేసిన ప్రసంగంలో థెరీసా భావోద్వేగం వ్యక్తం చేశారు.

బ్రెగ్జిట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా వారసునిపై ఉంది. పార్లమెంటులో ఏకాభ్రిప్రాయం సాధించడం ద్వారానే వారు దీన్ని సాధించగలరు. బలమైన, సుస్థిర నాయకత్వంతో బ్రిటిష్‌ సమాజంలోని అన్యాయాలపై పోరాటమే తన కర్తవ్యమని ప్రకటించి ప్రధాని పదవి చేపట్టిన థెరీసాకు బ్రెగ్జిట్‌ పుణ్యమా అని ఆ అవకాశమే లభించలేదు.ç పదవిలో ఉన్న మూడేళ్లూ బ్రెగ్జిట్‌తోనే సరిపోయింది. 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఆ నేపథ్యంలో ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ పదవీచ్యుతుడవడంతో థెరీసా ప్రధాని పగ్గాలు చేపట్టారు.

ఈయూతో కుదుర్చుకున్న బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని పార్లమెంటులో నెగ్గించుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేతలను కూడా బుజ్జగించేందుకు విఫలయత్నం చేశారు. అయితే, మూడుసార్లు పార్లమెంటులో జరిగిన ఓటింగులో థెరీసా ఒప్పందం వీగిపోయింది. 2017లో జరిగిన ఎన్నికల్లో థెరీసా పార్లమెంటులో మెజారిటీ కూడా కోల్పోవడంతో బ్రెగ్జిట్‌ భవిష్యత్తు మరింత సంక్లిష్టమయింది. వరుసగా మూడో సారి కూడా పార్లమెంటులో ఒప్పందం వీగిపోయింది. ఫలితంగా 62 ఏళ్ల థెరీసా రాజీనామాకు సిద్ధపడ్డారు.  

ప్రధాని పదవికి పోటీలో 11 మంది
ప్రధాని పదవి కోసం 11 మంది పోటీ పడుతున్నారు. ప్రధాని పదవి కోసం పోటీ చేసే అభ్యర్థి కనీసం 8 మంది ఎంపీల మద్దతు చూపించాల్సి ఉంటుంది. జూన్‌ 13, 18, 19 తేదీల్లో జరిగే రహస్య బ్యాలెట్‌లో పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు. జూన్‌ 22 న కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు