అవిశ్వాసంలో గెలిచిన మే

18 Jan, 2019 01:56 IST|Sakshi
అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన అనంతరం హర్షం వ్యక్తం చేస్తున్న బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే

19 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటులో ప్రధాని థెరెసా మే ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మే స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంపీలంతా పార్టీలకతీతంగా తమ స్వప్రయోజనాల ను పక్కనబెట్టి కొత్త బ్రెగ్జిట్‌ ఒప్పందం కుదుర్చుకోవడం కోసం తనతో కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మే రెండేళ్లపాటు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో చర్చలు జరిపి బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకొస్తే, అది బ్రిటన్‌ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందంటూ పార్లమెంటు గత మంగళ వారం బ్రెగ్జిట్‌ బిల్లును భారీ ఆధిక్యంతో తిరస్కరించింది. అదేరోజు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌ మే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా దానిపై ఓటింగ్‌ బుధవారం జరిగింది. బ్రెగ్జిట్‌ బిల్లుపై ఓటింగ్‌లో మే ఓడిపోయినా, అవిశ్వా సంలో మాత్రం 19 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. 26 ఏళ్ల తర్వాత తొలిసారి బ్రిటన్‌ పార్లమెంటు లో అవిశ్వాసంపై ఓటింగ్‌ జరగ్గా, మేకి అనుకూలం గా 325 ఓట్లు, వ్యతిరేకంగా 306 ఓట్లు వచ్చాయి.

సోమవారమే మరో ఒప్పందం
అవిశ్వాసంలో గెలిచిన అనంతరం మే మాట్లాడుతూ ‘ఇప్పుడు బ్రెగ్జిట్‌కు దారి కనుక్కోవడంపై దృష్టిపెట్టే అవకాశం మనకు లభించింది. మనం ఈయూ నుంచి బయటకు రావాలని బ్రిటన్‌ ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపీలంతా తమ స్వప్రయోజనాలను పక్కనబెట్టి, బ్రెగ్జిట్‌ ఒప్పందం కోసం మాతో కలసి నిర్మాణాత్మకంగా పనిచేయాలి’అని ఆమె కోరారు. సోమవారమే మరో కొత్త బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని సభ ముందు ఉంచుతానని మే స్పష్టం చేశారు. ‘ఇది అంత సులభమైన పని కాదు.  దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్న విషయం ఎంపీలకు తెలుసు. వారంతా ఏకాభిప్రాయానికి వచ్చి, దీన్ని సాధించాలి. తమకు ఏం వద్దో ఎంపీలు ఇప్పుడు స్పష్టంగా చెప్పారు. పార్లమెంటుకు ఏం కావాలో తెలుసుకునేందుకు మనమంతా కలసి పనిచేయాలి. ఈయూ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ ప్రజల కోరికను నెరవేర్చడం మన బాధ్యత అని నేను భావిస్తున్నా’అని మే వెల్లడించారు.

మొండిపట్టు వీడాలి: కార్బిన్‌
థెరెసా మే తన మొండిపట్టును వీడి భవిష్యత్తు ప్రణాళికలపై తీవ్రంగా ఆలోచించాలని ప్రతిపక్ష నాయకుడు జెరెమీ కార్బిన్‌ అన్నారు. అసలు ఏ ఒప్పందమూ లేకుండా బ్రెగ్జిట్‌ జరగదని మే హామీ ఇస్తేనే తదుపరి ఆశాజనక చర్చలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ తాము అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు బ్రెగ్జిట్‌ను సాధించేందుకు తాను ఏ పార్టీ ఎంపీతోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని మే ప్రకటించారు. కాగా, బ్రెగ్జిట్‌పై రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిందిగా దాదాపు 170 వాణిజ్య సంస్థలు మే, కార్బిన్‌లను కోరు తున్నట్లు టైమ్స్‌ పత్రిక తెలిపింది.

 ‘ప్లాన్‌ బీ’పై 29న ఓటింగ్‌
తొలి బ్రెగ్జిట్‌ ఒప్పందం బిల్లు పార్లమెంటు తిరస్కరణకు గురవడంతో థెరెసా మే ప్రవేశపెట్టనున్న ప్రత్యామ్నాయ బిల్లుపై ఈ నెల 29న దిగువ సభలో ఓటింగ్‌ జరగనుంది. సోమవారం మే ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టి, తన తదుపరి చర్యలేంటో చెబుతారనీ, 29న పూర్తిగా రోజు మొత్తం చర్చించిన తర్వాత ఓటింగ్‌ ఉంటుందని హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌ నాయకురాలు ఆండ్రియా లీడ్సమ్‌ చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్‌ మార్చి 29న బయటకు రావాల్సి ఉంది. అంటే బ్రెగ్జిట్‌కు సరిగ్గా రెండు నెలల ముందు ప్రత్యామ్నాయ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్‌ జరగనుంది. 

మరిన్ని వార్తలు