వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

17 Jan, 2019 10:14 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటులో ప్రధాని థెరెసా మేకు స్వల్ప ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా లేబర్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 19 ఓట్ల తేడాతో కన్జర్వేటివ్‌ ప్రభుత్వం ఈ అవిశ్వాస పరీక్షను నెగ్గింది. అంతకు ముందు మంగళవారం ఈయూతో బ్రెగ్జిట్‌ ఒప్పందం బిల్లును బ్రిటన్‌ పార్లమెంటు భారీ ఆధిక్యంతో తిరస్కరించిన సంగతి తెలిసిందే. వంద మందికి పైగా సొంత పార్టీకి చెందిన ఎంపీలే థెరెసా కుదిర్చిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌ ఒప్పందం ఓడిన వెంటనే ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌ ఆమెపై హాజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

బ్రెగ్జిట్‌ ప్రక్రియ మరో రెండు నెలల గడువే ఉండటంతో.. అవిశ్వాస పరీక్ష నెగ్గిన మే వేగంగా స్పందించారు. మూడు పార్లమెంటు పనిదినాల్లో ప్రత్యామ్నాయ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలు జరపడానికి ప్రతిపక్ష నేతలను థెరెసా మే ఆహ్వానించారు. 

బ్రిటన్‌ పార్లమెంటు నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు తిరస్కరణకు గురైతే మళ్లీ మూడు పార్లమెంటు పనిదినాల్లోగా ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లుకు కూడా ఆమోదం లభించని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవడానికి ప్రధానికి మూడు వారాల సమయం లభిస్తుంది. ఒకవేళ ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోయినట్టయితే బ్రిటన్‌ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్‌ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఓ శతాబ్ది కాలం వెనక్కి వెళుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు