వారెవ్వా.. ఈ దొంగలు సూపరో సూపర్‌

9 Aug, 2017 17:55 IST|Sakshi
వారెవ్వా.. ఈ దొంగలు సూపరో సూపర్‌

లండన్‌: పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లే దొంగలందు మంచి దొంగలు వేరయా అని చెప్పక తప్పదేమో ఈ సంఘటన చూస్తుంటే. దొంగిలించుకెళ్లిన బైక్‌ను తిరిగి తీసుకురావడమే కాకుండా దానిలో తిరిగి పెట్రోల్‌ ట్యాంక్‌ ఫుల్‌ చేసి, కొత్త తాళం చేయించి పెట్టి క్షమాపణలు కోరుతూ ఓ లేఖ కూడా రాసి పెట్టిపోయే బాధితులు ఆశ్చర్యపోయేలా ఇద్దరు దొంగలు. తాము ఏ యువకుడిదో ఆ బైక్‌ అనుకొని పొరబడ్డామని అందుకు క్షమించాలని ఆ లేఖలో వివరించారు. వివరాల్లోకి వెళితే..రెండు వారాల కిందట మెల్‌ ఫిషర్‌ అనే బ్రిటన్‌ మహిళ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఒక విజ్ఞాపన కథనాన్ని వెలువరించింది. తన ప్రియుడి కుమారుడి బైక్‌ను ఎవరో దొంగిలించుకెళ్లారని, దయచేసి ఆ బైక్‌ కనిపిస్తే వివరాలు అందించాలని అందులో కోరారు.

అయితే, ఆమె అలా పోస్ట్‌ చేసిన వారం రోజుల్లోనే అనూహ్యంగా ఒక రోజు ఆ పిల్లాడి బైక్‌ ఇంటిముందే కనిపించింది. పైగా దానికి కొత్త తాళం చేయించి ఉండటంతోపాటు ఫుల్‌గా పెట్రోల్‌, ఓ క్షమాపణ పత్రం కనిపించింది. దీంతో మెల్‌ ఫిషర్‌, ఆమె ప్రియుడి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. 'మీ కుమారుడి బైక్‌ దొంగిలించినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాం. వాస్తవానికి మేం చేసిన తప్పు క్షమార్హం కాకపోయినప్పటికీ వివరణ ఇచ్చుకుంటున్నాం. మేం ఎవరో టీనేజర్‌ది ఆ బైక్‌ అని ఎత్తుకెళ్లాం. అయితే, మీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చూశాక వెంటనే మీ బైక్‌ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే మీ పిల్లాడి బైక్‌కు ఇక ఎవరూ దొంగిలించలేనంత బలమైన తాళాన్ని కొనుగోలు చేశాం. తాళాలు బైక్‌లో పెట్టాము. మీరు సూచించిన చోటే బైక్‌ ఇవ్వలేకపోతున్నాం. కానీ, ఈ బైక్‌ చూశాకనైనా గుండెపలిగిన మీ పిల్లవాడు సంతోషపడతాడని భావిస్తున్నాం. ఈ బైక్‌ను నడిపే యోగ్యత అతడికే ఉంది' అంటూ ఆ లేఖలో వివరించారు.

మరిన్ని వార్తలు