'ఈ పిట్ట చిందేస్తే చిరిగి చాటైపోద్ది!'

10 Jan, 2016 16:55 IST|Sakshi
'ఈ పిట్ట చిందేస్తే చిరిగి చాటైపోద్ది!'

ప్రకృతిని సరిగా పరిశీలించాలేగానీ అందులోని జీవరాశి ముందు మనం నామమాతృలమే అనిపిస్తుంటుంది. అది జీవంలోనూ, జీవన శైలి విషయంలోనూ.. ఎందుకంటే మాట్లాడే శక్తిమనకు అదనంగా ఉందనే విషయం తప్ప మిగితా ఏ అంశాలు చూసుకున్నా.. ఆ జీవరాశి చాలా గొప్పవనే చెప్పకతప్పదేమో. మనం చేసే ఏపనికైనా ఓ క్రమబద్దమైన శిక్షణ అవసరం. అంతటి శిక్షణ పొందినా ఆ నేర్చుకున్న పనిని సరిగా ఎదుటి వ్యక్తికి చూపించలేము. కానీ, పచ్చటి ప్రకృతిలో నివసించే జీవరాశి  మాత్రం మన కళ్లకు చూపించే అంశాలను చూస్తే అబ్బురపడాల్సిందే.

సాధారణంగా నాట్యం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది నెమలినే.. ఆ తర్వాత ఏ ప్రతిష్టాత్మక నృత్యకారిణినో గుర్తుకు చేసుకుంటాం. కానీ, అడవిలో నాట్యం చేస్తూ చక్కటి డ్యాన్సులు కూడా వేయగలిగిన పక్షి ఉందంటే ఆశ్యర్యపోక తప్పదేమో. ఆ పక్షి చూడటానికి కొంచెం ఆకుపచ్చ మరికొంచెం నలుపురంగులో ఉండి.. తలపై సహజ సిద్ధంగా ఉండే రెండు పొడగాటి నెమలిపించంలాంటి ఈకలు ఉండి ముద్దుగా కనిపిస్తుంది. మాములుగా చూస్తే అది ఓ మామూలు పిట్టలా కనిపిస్తుంది. కానీ, దానికిగానీ సంతోషం వేసిందంటే వెంటనే బుల్లి గౌను వేసుకున్న పాపలా మారిపోయి తన కాలినుంచి మెడ వరకు ఉన్న ఈకలు మొత్తాన్ని ఓ పొట్టి గౌనులాగా మారుస్తుంది. వెంటనే ఏదో డప్పు నృత్యం వింటున్నట్లుగా లోకాన్ని మర్చిపోయి చిందులేస్తుంది. ఆ డ్యాన్సు చూశారంటే విజిల్ కొట్టకుండా ఆగలేరేమో..