మరుగుదొడ్లు ఉపయోగిస్తే ఎదురు డబ్బు!

2 Jun, 2016 22:34 IST|Sakshi
మరుగుదొడ్లు ఉపయోగిస్తే ఎదురు డబ్బు!

దక్షిణ కొరియా: ప్రభుత్వం ఏర్పాటు చేసినవి కాకుండా ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన సులబ్‌ కాంప్లెక్స్‌ మరుగుదొడ్లను ఉపయోగిస్తే డబ్బులు చెల్లించాల్సిందే. కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా కాదు.. వాళ్లే ఎదురు డబ్బులిస్తారట. ఉల్సాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఓ వినూత్నమైన సులభ్‌ కాంప్లెక్స్‌ను రూపొందించారు. దీన్ని వాడుకునేందుకు మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోగా.. నిర్వాహకులే మీకు ఎదురు చెల్లిస్తారు. ఎందుకలా అని ఆశ్చర్యపోతున్నారా?  ఈ కాంప్లెక్స్‌లో మానవ వ్యర్థాలను బయో ఇంధనాలుగా మార్చే ఏర్పాట్లున్నాయి.

టాయిలెట్‌ లోపల ఉండే యంత్రం వ్యర్థాల్లోని నీటిని వేరు చేస్తుంది. మిగిలినపోయిన పదార్థం ఆ తరువాత వేల రకాల సూక్ష్మజీవుల సాయంతో వాసనలేని ఎరువుగా మారిపోతుంది. ఈ ప్రక్రియలో కార్బన్‌డై యాక్సైడ్, మీథేన్‌ వాయువులు విడుదలవుతాయి. కార్బన్‌డైయాక్సైడ్‌ను బయోడీజిల్‌ ఉత్పత్తికి పనికొచ్చే నాచు (ఆల్గే) పెంపకానికి వాడతారు. మీథేన్‌ను నేరుగా ఇంధనంగా వాడవచ్చు. ‘ది సైన్స్‌ వాల్డెన్‌ పెవెలియన్‌’ అని పిలుస్తున్న ఈ కాంప్లెక్స్‌ అసలు ఉద్దేశం నీటిని అతితక్కువగా వాడే టాయిలెట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం. ప్రజలను ఈ కాంప్లెక్స్‌కు రప్పించేందుకు ఓ స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ కూడా తయారుచేశారు. దీని సాయంతో వ్యర్థాల ద్వారా ఎంత మొత్తంలో ఇంధనం ఉత్పత్తి అవుతుంది, దాని విలువ ఎంత, తదితర వివరాలు తెలుస్తాయట!

మరిన్ని వార్తలు