కరోనా పాజిటివ్‌.. ఇదో అవలక్షణం!  

20 May, 2020 04:45 IST|Sakshi

నాకు జ్వరం లేదు.. దగ్గు లేనే లేదు..  తుమ్ములు రావడమే లేదు.. కరోనా వైరస్‌ లక్షణాలు ఏవీ లేవు.. కానీ..  నేను కరోనా పాజిటివ్‌!! 
ప్రస్తుతం కరోనాపై మనం సాగిస్తున్న పోరులో ఇదో పెద్ద సవాలు.. వైరస్‌ శరీరంలో ప్రవేశించినా.. ఎటువంటి లక్షణాలు లేని వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారు. తెలియకుండానే చాలామందికి వైరస్‌ వ్యాప్తి చేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆదివారం చైనాలో 17 కొత్త కేసులు నమోదైతే.. అందులో 12 కేసుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు!  ‘వాళ్లలో లక్షణాలు కనిపించవు.. అనుమానించే పరిస్థితి ఉండవు.. మిగిలిన వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తే.,. లక్షణాలు కనిపిస్తాయి.

దీని వల్ల వెంటనే దాన్ని గుర్తించి.. ఇన్‌ఫెక్షన్‌ మిగిలినవారికి సోకకుండా నివారించవచ్చు.. కరోనా వైరస్‌ ఇలా కాదు.. ఇప్పుడీ లక్షణాలు కనబరచని రోగులతోనే పెద్ద సమస్య. వీరిలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండడం కూడా ఈ లక్షణాలు బయడపడకపోవడానికి ఒక కారణం అయిఉండొచ్చు. వీరి నుంచి ఇన్‌ఫెక్షన్‌ చెయిన్‌ను తెంచాలంటే.. ఎంత ఎక్కువ మందికి అయితే.. అంత మందికి పరీక్షలు చేయడం అత్యుత్తమ మార్గం’ అని జాన్స్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సెక్యూరిటీ(అమెరికా)కు  చెందిన సీనియర్‌ పరిశోధకుడు, ఇమ్యునాలజిస్ట్‌ గిగి గ్రాన్‌వాల్‌ తెలిపారు.

అన్ని వసతులు లేకుంటే.. లక్షణాలతో సంబంధం లేకుండా.. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించడం మేలని.. అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. మన దేశంలోనూ ఇలాంటి ‘లక్షణాలు లేని’ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్ ‌(ఐసీఎంఆర్‌) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు లక్షణాలు లేని వీరి ద్వారా కరోనా వ్యాప్తి ఎలా అన్నది ఓసారి చూద్దామా..  

ఇలా ఎంత మంది.. 
ప్రతి నలుగురిలో ఒకరికి ఎలాంటి కరోనా లక్షణాలు కనపడకపోవచ్చు.. 
ఆధారం: అమెరికాలో జరిగిన అధ్యయనాలు.. 

ఇదెందుకంత సమస్య.. 
అసింప్టొమాటిక్‌ క్యారియర్లలో 
లక్షణాలు కనపడవు.. కానీ ఇన్‌ఫెక్షన్‌ ఉంటుంది..  
సైలెంటుగా వీరి ద్వారా చాలామందికి కరోనా వ్యాపిస్తుంది.  

లక్షణాలు లేకపోవడం వల్ల పరీక్షల ద్వారానే వీరిని గుర్తించగలం. అయితే, ఇందుకోసం భారీ స్థాయిలో టెస్టింగ్‌ కిట్ల అవసరం ఉంటుంది.

మరిన్ని వార్తలు