హ్యాండ్సప్‌.. డోంట్‌ షూట్‌!

4 Jun, 2020 04:29 IST|Sakshi
డౌన్‌టౌన్‌ పోర్ట్‌ల్యాండ్‌ సిటీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది ఆందోళనకారులు

హ్యూస్టన్‌ భారీ ర్యాలీలో నినాదాలు

ఫ్లాయిడ్‌ మృతిపై పౌరహక్కుల విచారణ 

శాంతిని కాపాడండి: మెలానియా ట్రంప్‌

అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయమిది: జార్జి బుష్‌

హ్యూస్టన్‌: జార్జ్‌ ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా హ్యూస్టన్‌లో జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకానికి బలైన ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఫ్లాయిడ్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర మేయర్‌ సిల్వస్టర్‌ టర్నర్, ఎంపీ షీలా జాక్సన్, లిజ్జీ ఫ్లెచర్, సిల్వియా గార్సియా అల్‌ గ్రీన్‌లతోపాటు కొంతమంది ర్యాప్‌ గాయకులు  ర్యాలీలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. ‘హ్యాండ్స్‌ అప్‌.. డోంట్‌ షూట్‌’, ‘నో జస్టిస్, నో పీస్‌’అని నినదిస్తూ ర్యాలీ హ్యూస్టన్‌ నగరం గుండా సాగింది.

డిస్కవరీ గ్రీన్‌ పార్క్‌ నుంచి సిటీహాల్‌ వరకూ ఉన్న మైలు దూరం ఈ ర్యాలీ నడిచింది. అయితే సూర్యాస్తమయం తరువాత ఈ ర్యాలీ కాస్తా ఆందోళనలకు దారితీసిందని, ఖాళీ నీటిబాటిళ్లతో విసరడంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్‌ చేశారని వార్తలు వచ్చాయి. ర్యాలీ ప్రారంభానికి ముందు అందరూ మోకాళ్లపై నిలబడి కాసేపు ప్రార్థనలు చేయగా హ్యూస్టన్‌ పోలీస్‌ అధికారులు  ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. పోలీస్‌ అధికారి ఆర్ట్‌ ఎసివిడో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ భార్య రాక్సీ వాషింగ్టన్‌ మాట్లాడుతూ ఆరేళ్ల తన కుమార్తె గియానా మంచి తండ్రిని కోల్పోయిందన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలని వాపోయింది.  

వీధుల్లో ప్రశాంతత..
వారం రోజులపాటు అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన అమెరికన్‌ నగర వీధుల్లో ఎట్టకేలకు కొంత ప్రశాంతత నెలకొంది. మంగళవారం ప్రదర్శనలు జరిగినా చాలావరకూ అవి శాంతియుతంగా సాగాయి. ఆందోళనలకు సంబంధించి బుధవారంనాటికి మొత్తం 9,000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు.   

పౌరహక్కుల విచారణ..
జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్‌ పలీస్‌ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్‌ రెబెకా లూసిరో, గవర్నర్‌ టిమ్‌ వాల్ట్‌జ్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విచారణ ద్వారా పోలీసుల వివక్షాపూరిత చర్యలను గుర్తించి తాత్కాలికంగానైనా పరిష్కార చర్యలను అమల్లోకి తేవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందించాలన్న అమెరికా సిద్ధాంతం ఎక్కడ? ఎందుకు విఫలమైందో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని, జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణోదంతం ఇందుకు కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్‌ భార్య)తోపాటు నేను ఫ్లాయిడ్‌ ఉదంతంపై ఎంతో బాధపడ్డాం. అన్యాయమైన వ్యవహారాలు దేశం ఊపిరి తీసేస్తున్నాయి. అయినాసరే.. ఇప్పటివరకూ మాట్లాడకూడదనే నిర్ణయించాం. ఎందుకంటే ఇది లెక్చర్‌ ఇచ్చే సమయం కాదు. వినాల్సిన సమయం’అని బుష్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు.  

శాంతియుతంగా ఉండాలి: మెలానియా
ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా  స్పందించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలవారు, పౌరులందరూ సురక్షితంగా ఉండాలంటే శాంతి ఒక్కటే మార్గమని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని మెలానియా ట్వీట్‌ చేశారు. ఒక రోజు ముందు మెలానియా ఇంకో ట్వీట్‌ చేస్తూ.. ఫ్లాయిడ్‌ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్‌ మతం ముసుగులో తనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి.  సాధారణ పరిస్థితుల్లో ట్రంప్‌ మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి ఏమీ కాదని, ప్రస్తుతం పదేపదే చర్చిలకు వెళ్లడం, బైబిల్‌ పట్టుకుని పోజులు ఇవ్వడం మత విశ్వాసాలు ఉన్న వారిని తమవైపు ఆకర్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా మీడియా విమర్శిస్తోంది. 
 

>
మరిన్ని వార్తలు