ట్రంప్‌తో డిన్నర్‌: మనవాళ్లు ముగ్గురు

26 Jan, 2018 12:02 IST|Sakshi

దావోస్‌: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ట్రంప్‌  యూరోపియన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో  ప్రత్యేకంగా  భేటీ అయ్యారు. టాప్‌ 15 కంపెనీల సీఈవోలతో ట్రంప్‌ డిన్నర్‌కు హాజరయ్యారు. డైన్‌ విత్‌  గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్స్‌ కార్యక్రమంలో  ముఖ‍్యంగా  భారత సంతతికి చెందిన  ముగ్గురు సీఈవోలు పాల్గొనడం విశేషం.

నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్,  నోకియా సీఈవో రాజీవ్ సూరి , డెలాయిట్‌ సీఈవో  పునీత్‌ రెన్జెన్‌   ట్రంప్‌తో ఈ డిన్నర్‌లో పా​ల్గొన్న ప్రముఖులు.  మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి అయిన నరసింహన్  సెప్టెంబరు 2017 లో నోవార్టిస్‌ సీఈవోగా ఎంపికయ్యారు.   రోహ్‌తక్‌లో జన్మించిన పునీట్ రెన్జెన్ జూన్ ,2015లో  డెలాయిట్  సీఈవోగా నియమితులయ్యారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన ప్రయత్నాలలో భాగంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టమని  ట్రంప్‌ టాప్‌  సీఈవోలను ఆహ్వానించారు.  ఈ సందర్భంగా తన హయాంలో అభివృద్ధి చెందుతున్న అమెరికా  ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. తన పన్ను విధానాలు, డీరెగ్యులేషన్ లతోపాటు అమెరికన్ వ్యాపారవృద్ధిలో  తన కృషి గురించి వివరించారు. ఇంకా ఈ డిన్నర్‌కు అమెరికా ప్రతినిధి బృందంలో  విదేశాంగ కార్యదర్శి రెక్స్ తిల్లెర్‌సన్‌, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కిర్‌స్టేజెన్ నీల్సన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హెచ్ ఆర్ మక్ మాస్టర్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్‌ గ్యారీ కోహెన్ హాజరయ్యారు.

 

మరిన్ని వార్తలు