ట్రైసైకిల్‌తో ట్రాఫిక్‌లోకి బుడ్డోడు!

22 Mar, 2018 18:01 IST|Sakshi

బీజింగ్‌ : మూడేళ్ల బాలుడు తన మూడు చక్రాల సైకిల్‌తో ఆడుకుంటూ రోడ్డెక్కేశాడు. వీడియో గేమ్‌లా ఫీల్‌ అయ్యాడో ఏమో తెలియదుగానీ రోడ్డుపై వస్తున్న వాహనాలకు వ్యతిరేకంగా వెళ్లడం మొదలు పెట్టాడు. అసలే అది ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే సమయం. రోడ్డు మీద ఎదురుగా వాహనాలు వస్తూనే ఉన్నాయి. అన్నీ వాహనాలు చిన్నారి పక్కనుంచే వెళ్తున్నా, బాబుని పక్కకు తీసుకెళ్దామని ఎవరు ప్రయత్నించలేదు. తూర్పు చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తొలిసారి ఈ వీడియో చూసేవారికేవరికైనా ఒక్క క్షణం ఆ బాబుకి ఏమవుతుందో అనే ఆందోళన కలగక మానదు.

కానీ చివరకు అటుగా వెళ్తున్న ఒక జంట తమ కారుని ఆపి బాలున్ని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకొచ్చి, పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆ బాలున్ని పోలీసులు అతని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చారు. చైనాలో రోడ్డు ప్రమాదాల వల్ల 10వేలమంది చిన్నారులు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన తెలియజేస్తుంది.

.

మరిన్ని వార్తలు