తప్పిన ముప్పు.. కూలిన చైనా స్కైలాబ్‌..!

2 Apr, 2018 09:40 IST|Sakshi

బీజింగ్‌: ప్రస్తుతం నిరుపయోగంగా మారిన చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. టియాంగంగ్‌-1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం)  భూ వాతావరణంలోకి ప్రవేశించిందని, భూవాతావరణంలోకి రావడంతోనే దగ్ధమైన అది దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో కూలిపోయిందని చైనా అంతరిక్ష సంస్థ పేర్కొన్నట్టు ఆ దేశ వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. అమెరికా సైన్యం కూడా ఈ వార్తను ధ్రువీకరించింది. దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఇది కూలిపోయిందని తెలిపింది.   

టియాంగంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా అప్పట్లో రూపొందించారు. 2013 జూన్‌ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్‌–1 అంతరిక్ష  కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ ప్రకటించడంతో ఇది భూవాతావరణంలోకి దూసుకొస్తున్న విషయంలో వెలుగులోకి వచ్చింది. అయితే టియాంగంగ్‌-1 భూమిపై ఏ సమయంలో, ఎక్కడ పడుతుందనే కచ్చితమైన వివరాలను ఏజెన్సీ వెల్లడించకపోవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది.

8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవుండే టియాంగంగ్‌ స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్‌ తదితర దేశాల్లో పడిపోయే అవకాశం ఉందని, లేదా న్యూజిలాండ్, టాస్మానియా, అమెరికాల్లోనూ కూలొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. అంతరిక్ష కేంద్రం కూలిపోయినా భూమిపై జరిగే నష్టం పెద్దగా ఉండబోదనీ, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చైనా అధికారులు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇది సముద్రంలో కూలిపోవడంతో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నాయి.

మరిన్ని వార్తలు