తుర్రో... తుర్రు..

11 May, 2018 02:12 IST|Sakshi

సాక్షి, తెలంగాణ డెస్క్‌: అనగనగనగా టాంజానియా అనే దేశం.. మన దేశానికి చాలా దూరం లెండి.. అక్కడ సెరెన్‌గెటీలో ఓ సఫారీ పార్కు.. ఈ పార్కులో బోలెడన్ని పులులు, చిరుతలు.. సింహాలు.. ఏనుగులు.. పాములు.. ఆ.. మర్చిపోయాను.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కొంగ బావ కూడా ఇక్కడే ఉంటోంది. ఈ మధ్య.. ఓ మిట్టమధ్యాహ్నం వేళ.. సరిగ్గా లంచ్‌ టైము అన్నమాట. ఈ చిరుత పులి కడుపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయి. అసలే దీనికి ఆకలి ఎక్కువ.. టైముకి తిండి ఠంచనుగా పడిపోవాల్సిందే.. మరి ఇదేమో జూ కాదాయే.. టైముకి ఫుడ్‌ పెట్టడానికి.. సఫారీ పార్కు.. దాంతో వేటకు బయల్దేరింది.. ఎంత వెతికినా.. ఒక్క జంతువూ కనపడలేదు.. ఇంక నీరసం వచ్చి పడిపోతుంది అనుకునే లోపు.. అక్కడికి దగ్గర్లో అప్పుడే లంచ్‌ కానిచ్చి.. అరగడానికి వాకింగ్‌ చేస్తున్న కొంగ బావ కనిపించింది.. అంతే.. గడ్డిలో చటుక్కున దాక్కుంది.. యుద్ధరంగంలోని సైనికుడిలాగ బరబరమని.. పాక్కుంటూ.. దాని దగ్గరికి వెళ్లింది.. ఈ కొంగ పని ఇక అయిపోయింది నా సామి రంగా అని అనుకుంటూ ఒక్కసారిగా దబీమని దూకింది.. అయితే.. కొంగబావకి మామూలుగానే తెలివితేటలు ఎక్కువ.. దీనికి కాస్త సిక్త్స్‌ సెన్స్‌ కూడా ఉన్నట్లుంది.. వెంటనే ప్రమాదాన్ని గ్రహించింది.... ఇంకేముంది.. తుర్రో.. తుర్రు..

మరిన్ని వార్తలు