‘సోషల్‌’ పాస్‌వర్డ్స్‌ చెబితేనే వీసా!

10 Feb, 2017 01:02 IST|Sakshi
‘సోషల్‌’ పాస్‌వర్డ్స్‌ చెబితేనే వీసా!

సామాజిక మాధ్యమాల ఖాతా వివరాలు వెల్లడిస్తేనే అమెరికాలోకి ఎంట్రీ
►  అమలు ప్రయత్నాల్లో ట్రంప్‌ సర్కారు

వాషింగ్టన్: విదేశీయులకు వీసాల జారీని మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్‌ సర్కారు సిద్ధమవుతోంది. అమెరికాలో పర్యటించాలనుకుంటే ఇక నుంచి సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్స్‌ను చెప్పాల్సి రావచ్చని వైట్‌హౌస్‌ అధికారులు గురువారం వెల్లడించారు. పాస్‌వర్డ్స్‌ సాయంతో ఫేస్‌బుక్, ట్వీటర్‌ వంటి ఖాతాల్ని పరిశీలించి వీసా దరఖాస్తుదారుల పూర్వపరాలను అంచనావేస్తామన్నారు. ‘విదేశీ ప్రయాణికుల్ని సోషల్‌ మీడియా ఖాతాల వివరాలతో పాటు,పాస్‌వర్డ్స్‌ను ఎంబసీ అధికారులు అడగొచ్చు.

ఏ వెబ్‌సైట్లు చూస్తున్నారో వెల్లడించడంతో పాటు పాస్‌వర్డ్స్‌ తెలపాల్సిన అవసరముంటుంది.అప్పుడే ఇంటర్‌నెట్‌లో వారు ఏం చేస్తున్నారో పరిశీలించగలం’ అని అమెరికా హోం ల్యాండ్‌ భద్రతా కార్యదర్శి జాన్  కెల్లీ పేర్కొన్నారు. కేవలం ఏడు దేశాలకు చెందిన పౌరులకే ఈ నిబంధన వర్తిస్తుందా? లేక అన్ని దేశాలకా? అన్న దానిపై  వైట్‌హౌస్‌ స్పష్టత ఇవ్వలేదు. దరఖాస్తుదారులు సహకరించకపోతే, అమెరికాకు రాలేరని చెప్పారు. ప్రస్తుతానికి ఇది ఆలోచన దశలోనే ఉందని పేర్కొన్నారు.

ఆర్థిక వివరాల్ని ప్రశ్నిస్తాం: వైట్‌హౌస్‌
‘అదనపు నిబంధనలు పెట్టనున్నాం. ఆర్థిక వివరాల్ని తెలుసుకుంటారు. జీవనాధారం ఏంటి? డబ్బు ఎవరు పంపారు? వంటి వివరాలు తెలుసుకోవచ్చు’ అని చెప్పారు.

అటార్నీగా సెషన్స్  ఎంపికపై డెమొక్రాట్ల అభ్యంతరం
ట్రంప్‌ అటార్నీ జనరల్‌గా జెఫ్‌ సెషన్స్  ఖరారయ్యారు. సెషన్స్ అభ్యర్థిత్వంపై డెమొక్రాట్లు అభ్యంతరం తెలపడంతో సెనెట్‌లో దాదాపు 30 గంటల సుదీర్ఘ చర్చ సాగింది. అయితే చివరికి 52–47 ఓట్ల తేడాతో ఆయన గట్టెక్కారు. ఒక దశలో లిబరల్‌ పార్టీ సెనెటర్‌ ఎలిజబెత్‌ వారెన్ , రిపబ్లికన్ల మధ్య తీవ్ర వాగ్వాదం సాగింది. పౌర, వలసదారుల హక్కుల వ్యతిరేకిగా ముద్రపడ్డసెషన్స్ ను అటార్నీగా ఎలా నియమిస్తారు? అంటూ సెనెట్‌లో డెమొక్రాట్లు ప్రశ్నించారు. 1997 నుంచి అలబామా సెనెటర్‌గా ఉన్న సెషన్స్ 84వ అటార్నీ జనరల్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కాగా, అమెరికా, చైనాలకు ప్రయోజనం కలిగేలా నిర్మాణాత్మక సంబంధాలు నెలకొనాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు లేఖ రాశారు. మరోవైపు,  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా రూపొందించిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలంటూ దుకాణ యజమానుల్ని వైట్‌హౌస్‌ సలహాదారురాలు కెల్లీఅన్నే కోరారు. ఇవాంక తయారుచేస్తున్న దుస్తుల్ని విక్రయించకూడదని ప్రముఖ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ నార్డ్‌స్రూ్టమ్‌  నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు