టైమ్‌‘ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ డొనాల్డ్ ట్రంప్

8 Dec, 2016 03:25 IST|Sakshi
టైమ్‌‘ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ డొనాల్డ్ ట్రంప్

న్యూయార్క్: ఆన్‌లైన్ రీడర్స్ సర్వేలో అగ్రస్థానంలో నిలిచిన భారత ప్రధాని మోదీని తోసిరాజని అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్‌ను టైమ్ మేగజీన్ 2016 ఏడాదికి‘ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. తొలి రన్నపరప్‌గా ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్, రెండో రన్నరప్‌గా ఆన్‌లైన్ హ్యాకర్లు నిలిచారు. ఈ గౌరవానికి బరిలో నిలిచిన తుది 11 మందిలో భారత ప్రధాని మోదీ కూడా  ఉన్నారు. ఈ నిర్ణయం వెలువడిన తరువాత ట్రంప్ స్పందిస్తూ ‘ ఇది గొప్ప గౌరవం. టైమ్ మేగజీన్ చదువుతూ పెరిగాను. గతంలో ఈ మేగజీన్ కవర్ పేజీపై చోటు సంపాదించడం నా అదృష్టం ’అని ఎన్‌బీసీ న్యూస్‌తో సంతోషం పంచుకున్నారు.
 
  ప్రభుత్వ వ్యతిరేక, ప్రజాకర్షక అభ్యర్థిగా ప్రచారం చేసి అమెరికా ఎన్నికల్లో కనీవిని ఎరుగని విధంగా ట్రంప్ విజయం సాధించారని ‘టైమ్’ కొనియాడింది.  ప్రపంచ వ్యాప్తంగా మంచికి లేదా చెడుకి వార్తల్లో ఎక్కువగా నిలిచిన నాయకులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ను టైమ్ ఎడిటర్‌లు ఎంపిక చేస్తారు. ఇతర పోటీదారుల్లో...యూఎస్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, టర్కీ అధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్డోగాన్,  యూకే ఇండిపెండెన్‌‌స పార్టీ నాయకుడు నైగల్ ఫరేజ్,  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్‌బర్గ్ తదితరులున్నారు.
 
 తదుపరి రక్షణ మంత్రిగా మ్యాటిస్
 4 స్టార్ మెరైన్ కోర్ రిటైర్డ్ జనరల్ జేమ్స్ మ్యాటిస్‌ను ట్రంప్ అమెరికా తదుపరి రక్షణ శాఖ మంత్రిగా నియమించారు. 66 ఏళ్ల మ్యాటిస్‌కు ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అమెరికా రక్షణ విధానంలో విజయం సాధించాలంటే రక్షణ విభాగాన్ని నడిపించేందుకు సరైన వ్యక్తి కావాలని మ్యాటిస్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు