టెస్ట్‌ ట్యూబ్‌ చెట్లు! 

5 Nov, 2018 22:12 IST|Sakshi

బ్రిటన్‌: టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల గురించి విన్నాం. కానీ... ఈ టెస్ట్‌ ట్యూబ్‌ చెట్లు ఏంటని ఆలోచిస్తున్నారా? అంతరించి పోతున్న వృక్ష జాతిని సంరక్షించడానికి శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన విధానమే ఈ టెస్ట్‌ ట్యూబ్‌ చెట్లు. ప్రపంచంలో అనేక వృక్షాల జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వృక్షజాతుల్లో ఐదింట్లో ఒకటి అంతరించిపోయే ప్రమాదం ఉందని, అందుకే వాటిని పరిరక్షించడంపై దృష్టి సారించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టెస్ట్‌ ట్యూబుల్లో చెట్లను పెంచుతున్నారు. ఈ టెస్ట్‌ ట్యూబ్‌ చెట్ల విధానం ఇన్సూరెన్స్‌ పాలసీలాంటిదని బ్రిటన్‌లోని వెస్ట్‌ ససెక్స్‌లోగల క్యూస్‌ మిలీనియం సీడ్‌ బ్యాంక్‌లో పని చేస్తున్న డాక్టర్‌ జాన్‌ డికీ అభిప్రాయపడ్డారు.

అంతరించి పోయే ప్రమాదమున్న విత్తనాలను సీడ్‌ బ్యాంక్‌లో ఉన్న రేడియేషన్‌ ప్రూఫ్‌ నేల మాళిగల్లో భద్రపరుస్తున్నారు. 2020 నాటికి అంతరించిపోయే ప్రమాదం ఉన్న వృక్షాల్లో కనీసం 75 శాతం వృక్ష జాతులను పరిరక్షించడం వీరి లక్ష్యం. సీడ్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న మరో పరిశోధకులు డేనియల్‌ బాలెస్టెరోస్‌ మాట్లాడుతూ.. ‘సీడ్‌ బ్యాంక్‌ ఫ్రీజర్‌లో భద్రపరిచినట్లు, అన్ని రకాల మొక్కల విత్తనాలను ఎండబెట్టి భద్రపరచడం సాధ్యం కాదు. ఉదాహరణకు సింధూర వృక్షం లేదా చెస్ట్‌నట్‌ విత్తనాలు చాలా సున్నితమైనవి. వాటిని ఎండబెడితే వాటి నుంచి చెట్లు రావు. ఇలాంటి విత్తనాల పరిరక్షణ కోసం ‘క్రయోప్రిజర్వేషన్‌’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ విధానం ద్వారా మొక్క బీజాన్ని విత్తనం నుంచి వేరు చేసి, దాన్ని ద్రవరూప నైట్రోజన్‌లో అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఘనీభవింజేస్తాం. ఇలాంటి సీడ్‌ బ్యాంకుల ఉపయోగం ఇప్పటికే కనిపిస్తోంది. బ్రిటన్‌లో అంతరించిపోతున్న పచ్చికబయళ్లను సీడ్‌ బ్యాంక్‌లో భద్రపర్చిన విత్తనాల ద్వారా పరిరక్షించే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయ’న్నారు.   
 

మరిన్ని వార్తలు