అగ్రరాజ్య ఫలితం నేడే

9 Nov, 2016 02:20 IST|Sakshi
అగ్రరాజ్య ఫలితం నేడే

అమెరికాలో ముగిసిన అధ్యక్ష ఎన్నికలు
► కాలిఫోర్నియా, అలాస్కాల్లో ఉదయం 8 గంటల వరకూ ఓటింగ్
► తొలి ఫలితం వెల్లడైన డిక్స్‌విల్లే నోచ్‌లో హిల్లరీకి ఆధిక్యం
► న్యూహ్యాంప్‌షైర్‌లో హోరాహోరీ
►  స్వింగ్ రాష్ట్రాలైన వర్జీనియా,కొలొరాడో, నెవడాల్లో హిల్లరీకే మొగ్గు
► హిల్లరీ గెలుపు నల్లేరుపై నడకేనంటోన్న తాజా సర్వేలు
► నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఒహయోలపై ట్రంప్ ఆశలు

 
వాషింగ్టన్/న్యూయార్క్: చివరి వరకూ ఉత్కంఠ రేపిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పసిఫిక్ తీర రాష్ట్రాలైన కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్‌లతో పాటు అలాస్కా, హవాయ్ దీవుల్లో మాత్రం బుధవారం ఉదయం 8 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టారు. ఉదయం 10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. మధ్యాహ్నంలోపు అధ్యక్షుడు ఎవరనేది దానిపై పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది. ఇక న్యూహ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నోచ్ గ్రామం నుంచి వెలువడ్డ మొదటి ఫలితంలో హిల్లరీ ఆధిక్యం సాధించారు. మొత్తం 6 ఓట్లు పడగా నాలుగు హిల్లరీకి, రెండు ట్రంప్‌కు దక్కారుు.సమీపంలోని మిల్స్‌ఫీల్డ్‌లో మాత్రం ట్రంప్‌కు 16, హిల్లరీకి 4 ఓట్లు పడ్డాయి. హరస్ట్ లొకేషన్‌లో 17-14 ఓట్ల తేడాతో హిల్లరీకి ఆధిక్యం దక్కింది.

12 కోట్ల మంది ఓటుహక్కు వినియోగం.. 20 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా, 4.2 కోట్ల మంది ముందస్తు ఓటేవారు.  వీరిలో నల్లజాతీయులు, లాటిన్ వలసదారులు ఎక్కువగా ఉండడంతో హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడొచ్చని భావిస్తున్నారు. 2012లో 3.23 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఎన్నికలో దాదాపు 12 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం.

న్యూయార్క్‌లో హిల్లరీ, ట్రంప్ ఓటు.. భర్త బిల్‌క్లింటన్‌తో కలసి న్యూయార్క్ రాష్ట్రం చాప్పాక్వాలోని ప్రాథమిక పాఠశాలలో హిల్లరీ ఓటేశారు. ‘ఆనందంగా ఉన్నా’ అంటూ పోలింగ్ బూత్ బయటకు వస్తూ అన్నారు. పార్టీ మద్దతుదారులకు చేతులూపుతూ ఉత్సాహంగా కన్పించారు. మద్దతుదారులు ‘మేడమ్ ప్రెసిడెంట్’ అంటూ నినాదాలు చేశారు. ఇక భార్య మెలేనియాతో కలసి ట్రంప్ న్యూయార్క్ నగరంలో ఓటు వేశారు.

ఫలితంపై తీవ్ర ఉత్కంఠ.. హిల్లరీదే గెలుపు
ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, న్యూయార్క్, న్యూహ్యాంప్‌షైర్, మసాచుసెట్స్, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా తదితర రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రారంభమవడంతో ఫలితంపైఉత్కంఠ నెలకొంది. హిల్లరీ గెలుపు ఖాయమని సర్వేలు చెప్పడంతో ఫలితాన్ని తారుమారు చేసే రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపు తప్పనిసరి. అరిజోనా(11), ఫ్లోరిడా(29), నెవెడా(6), నెబ్రాస్కా రెండో కాంగ్రెస్‌నల్ డిస్ట్రిక్(1), న్యూహ్యాంప్‌షైర్(4), నార్త్ కరోలినా(15)లో ట్రంప్ గెలిస్తే విజయం దక్కినట్లే.

కాగా హిల్ల్లరీ అధ్యక్షురాలిగా ఎన్నికవడం ఖాయమని సీఎన్‌ఎన్ పేర్కొంది. మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లో ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని, స్వింగ్ రాష్ట్రాలైన వర్జీనియా, కొలరాడో, నెవడాల్లో మైనార్టీలు, ఉన్నత విద్యావంతుల ఓటర్లను ఆకర్షించడంలో విజయం సాధించారని తెలిపింది.నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఒహయోల్లో ట్రంప్ తప్పక గెలవాలి. న్యూహ్యాంప్‌షైర్, అయోవాల్లో కూడా గెలిస్తే అధ్యక్షుడయ్యే అవకాశాలుంటారుు.

చివరి నిమిషం వరకూ హోరాహోరీ ప్రచారం
డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు చివరి నిమిషం వరకూ ప్రచారం నిర్వహించారు. చివరిగా నార్త్ కరోలినా రాష్ట్రం రాలైగ్‌లో భారీ ర్యాలీలో హిల్లరీ ప్రసంగించారు. ట్రంప్ మిచిగన్ రాష్ట్రంలో చివరి ప్రసంగం చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల కు ఇద్దరి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముగిసింది.

పోటీ వల్ల నేను మారా: ట్రంప్
‘ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే భారీగా డబ్బు, శక్తి, సమయం వృథా అయినట్లే’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘నేను గెలవకపోతే అదేమీ గొప్ప విషయం కాదు. ఎన్నిక ప్రచారం అద్భుతంగా సాగింది. దేశమంతా పర్యటించి వివిధ స్థాయిల వ్యక్తుల్ని కలిశా. అందరూ అద్భుతం’ అంటూ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ఏం సాధించావని ప్రజలు అడిగితే అదే నేర్చుకున్నానని చెబుతానన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తనను పూర్తిగా మార్చేసిందని చెప్పారు.

అధ్యక్ష ఎన్నికలతో పాటే...
అధ్యక్ష ఎన్నికలతో పాటు 12 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, సెనెట్(100)లోని మూడో వంతు సీట్లకు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌‌స సభ్యుల కోసం మంగళవారమే ఎన్నికలు నిర్వహించారు. హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్‌‌స రేసులో 12 మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. మాజీ అటార్నీ కమలా హరిస్ కాలిఫోర్నియా నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే అమి బెరా, రో ఖన్నా(కాలిఫోర్నియా), ప్రమీల జయపాల్(వాషింగ్టన్), రాజా కృష్ణమూర్తి(ఇలినాయిస్), పీటర్ జాకబ్(న్యూజెర్సీ), అలోక్ కుమార్(మిచిగన్)లు పోటీలో ఉన్నారు. భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే వర్జీనియాలోని లౌడన్, ఫైర్‌ఫేక్స్‌ల్లో ఓటర్లు క్యూ కట్టారు. వీరిలో ఎక్కువ శాతం డెమోక్రటిక్ పార్టీకే మద్దతిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో ట్రంప్ వివాదాస్పద, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలు, హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ వివాదంతో పాటు కింది అంశాలు ఓటర్లపై ప్రభావం చూపాయి.

గన్స్ పై నిషేధం: గన్ కల్చర్‌పై నియంత్రణ విధించాలనేది డెమోక్రాట్ల ప్రధాన ప్రచారం. గన్ వినియోగంలో మార్పుల్ని అమెరికన్ కాంగ్రెస్ తిరస్కరించగా... అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం పూర్తిగా సమర్థిస్తూ పలు ఆదేశాలిచ్చారు.
► కనీస వేతనాలు
► కొన్ని చికిత్సల కోసం మారిజోనా వాడకం చట్టబద్దం
► మరణదండన ... మరణదండనకు ఉపయోగించే లెథల్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో మరణదండన అమవలవడం లేదు.
► ఆరోగ్య రంగం, వివాదాస్పదమైన ఒబామా కేర్ పాలసీ
►   సిగరెట్ల ధర పెరగడం
 
 70 శాతం చాన్స్ ఆమెకే!
 రిపబ్లికన్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కే శ్వేతసౌధానికి చేరుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అమెరికా ప్రముఖ సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2008, 2012 ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన ‘ఫైవ్ థర్టీఐట్’ అనే వెబ్ సైట్ ప్రకారం.. ‘చివరి రోజుల్లో క్లింటన్ ప్రచారం సానుకూల ప్రభావాలు చూపిస్తోంది. ఇందువల్ల ఆమె విజయం సాధించటం 70 శాతం ఖాయంగా కనబడుతోంది’. ఇతర సర్వేలు కూడా 2.9 నుంచి 3.8శాతం ఓట్ల మెజారిటీ పొందొచ్చని తెలిపాయి.
 
తప్పక గెలిచే రాష్ట్రాలు
రిపబ్లికన్ పార్టీ
అలబామా(9), అలాస్కా(3), ఐడహ(4), ఇండియానా(11), క్యాసస్(6), కెంటకీ(8), లూసియానా(8), మిస్సిసిపి(6), మిస్సోరీ(10), మాంటెనా(3), నెబ్రాస్కా(4), నార్త్ డకోటా(3), ఒక్లహోమా(7), సౌత్ కరోలినా(9), సౌత్ డకోటా(3), టెన్నెసే(11), టెక్సాస్(38), వెస్ట్ వర్జీనియా(5), వయోమింగ్(3) .... మొత్తం ఎలక్టోరల్స్ 157.
 మొగ్గు రాష్ట్రాలు: జార్జియా(16), అయోవా(6), మైనే రెండో కాంగ్రెస్‌నల్ డిస్ట్రిక్(1), ఒహయో(18), యూటా(6).... మొత్తం 47
 
డెమోక్రటిక్ పార్టీ
కాలిఫోర్నియా(55), కనెక్టికట్(7), డేలావేర్(3), వాషింగ్టన్ డీసీ(3), హవాయ్(4), ఇలినారుుస్(20), మైనే(3), మేరీల్యాండ్(10), మసాచుసెట్స్(11), న్యూజెర్సీ(14), న్యూయార్క్(29), ఓరెగాన్(7), రోడ్ ఐలాండ్(4), వెర్మాంట్(3), వాషింగ్టన్(12), మిన్నెసొటా(10), న్యూ మెక్సికో(5) మొత్తం 200.
 మొగ్గు రాష్ట్రాలు: కొలొరడో(9), మిషిగన్(16), పెన్సిల్వేనియా(20), వర్జీనియా(13), విస్కాన్సిన్(10)... మొత్తం 68
 
 హోరాహోరీ రాష్ట్రాలు
 అరిజోనా(11), ఫ్లోరిడా(29), నెవెడా(6), నెబ్రాస్కా రెండో కాంగ్రెస్‌నల్ డిస్ట్రిక్(1), న్యూహ్యాంప్‌షైర్(4), నార్త్ కరోలినా(15)... మొత్తం 66
 
ఫలితాలు ఇలా ఉండొచ్చు!

సీఎన్‌ఎన్ తాజా అంచనాల ప్రకారం... ఒహయో, యూటా రాష్ట్రాలతో పాటు మైనే రాష్ట్రంలోని ఒక డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ పార్టీకి గెలుపు అవకాశాలున్నారుు. ఇక అరిజోనా, ఫ్లోరిడా, నెవెడా, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో పోరు హోరాహోరీ.. పూర్తి పట్టున్న, స్వల్ప ఆధిక్యం ఉన్న రాష్ట్రాల నుంచి హిల్లరీకి 268 ఎలక్టోరల్స్ ఓట్లు ఖాయం. ఇక ట్రంప్‌కు 204 ఎలక్టోరల్స్ రావచ్చు. అధ్యక్ష పీఠం దక్కాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు తప్పనిసరి... 66 సీట్ల కోసం హోరాహోరీ సాగొచ్చు.
 
అంతరిక్షం నుంచి ఓటు
అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి షేన్ కింబ్రో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్టోబర్ 19న రష్యా అంతరిక్ష నౌక సూయజ్ ద్వారా ఇద్దరు వ్యోమగాములతో కలిసి కింబ్రో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. 1997 నుంచి అంతరిక్షం నుంచి కూడా అమెరికన్ వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తొలిసారి అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగామి డేవిడ్ వోల్ఫ్.
 
తగ్గని క్రేజ్
సాధారణంగా రెండుసార్లు అధికారంలో ఉన్న అధ్యక్షుడిపై అసంతృప్తి సహజం. అదీ అమెరికాలో ఇంతవరకు పదవినుంచి దిగిపోతున్న ఏ వ్యక్తికీ కనీస రేటింగ్ లేదు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాకు మాత్రం ఎన్నికల రోజు వరకూ 56 % మంది మంచి రేటింగ్ ఇచ్చారు. 2012లో రెండోసారి ఎన్నికయ్యేందుకు ముందు కూడా ఒబామాకు ఇంత రేటింగ్ రాలేదు. దీంతో.. ఒబామా పాపులారిటీ ఆధారంగానే క్లింటన్ విజయం గురించి కొన్ని సర్వేలు సానుకూల ఫలితాలు ఆశిస్తున్నాయి. కాగా, తాజా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. ‘ఉద్యోగాల విషయంలో ట్రంప్ వద్ద నిర్దిష్టమైన ప్రణాళికేమీ లేదనీ.. ప్రస్తుత వ్యవస్థను తిట్టడం మినహా ఏమీ చేయలేరు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు