చిన్నారికి ముక్కులో పెరిగిన మెదడు..!

15 Dec, 2015 04:58 IST|Sakshi
చిన్నారికి ముక్కులో పెరిగిన మెదడు..!

జ్ఞానేంద్రియాల్లో ముక్కు, శ్వాస పీల్చుకోవడంతోపాటు, వాసనలను పసికట్టేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మెదడులో భావాలను కలిగించే 'లిమ్బిక్' వ్యవస్థ వల్ల ముక్కు వాసనలను పసిగట్టగల్గుతుంది. ఇలా ముక్కునుంచి మెదడుకు సంబంధం ఉండటం మనకు తెలుసు.. కానీ ఆ బాలుడికి ఏకంగా మెదడే ముక్కులో పెరుగుతుండటం వైద్య రంగాన్నే విస్తుపోయేలా చేసింది. అయితే అనేక ఆపరేషన్ల తర్వాత బిర్మింగమ్ పిల్లల ఆస్పత్రి వైద్యులు చిన్నారి లోపాన్ని సరి చేయగలిగారు.

పుట్టుకతో వచ్చిన లోపంతో ఇబ్బందిపడుతున్న వేల్స్ మీస్టెగ్ ప్రాంతానికి చెందిన ఇరవై ఒక్క నెల్ల  ఒల్లీ ట్రీజీజ్ కు మెదడు భాగం చిట్లి దాని ద్వారా ముక్కులో ఓ తిత్తిలా మెదడు పెరగటం ప్రారంభించింది. వైద్య శాస్త్రంలో ఎన్సెఫలోసెల్ గా పిలిచే ఈ పరిస్థితిని గుర్తించేందుకు డాక్టర్లు కూడ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చిన్నారికి  ఇరవై వారాల వయసులో  స్కాన్ తీసిన వైద్యులు ముక్కులో  కండ పెరుగుతున్నట్లుగా భావించారు.

ఒల్లీ తల్లి  ఇరవై రెండేళ్ళ యామీ... వైద్యులు చెప్పిన విషయంతో షాక్ కు గురైంది. భర్తకు దూరమైన యామీ ఒల్లీని తన వరంగా భావించింది. చిన్నారికి ఏమౌతుందోనని ఖంగారు పడిపోయింది. తొమ్మిది నెలలు గడిచే సరికి ఒల్లీ రూపం పినాచియో బొమ్మలా మారుతూ వచ్చింది. దీంతో వైద్యులు అతడి ముక్కుకు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేదంటే అతడు ఊపిరి పీల్చడం కూడ కష్టంగా మారుతుందని యామీకి చెప్పారు. ఆమెకు అవగాహన కూడ కల్పించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత బిడ్డ ముక్కులో పెరుగుతున్నది కండకాదు.. ఓ తిత్తిలా పెరుగుతున్న మెదడు అని తేల్చారు. పుట్టుకతో వచ్చిన లోపంగా కూడ గుర్తించారు.

2014 నవంబర్ లో ఒల్లీకి బిర్మింగమ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో రెండుగంటల పాటు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. పుర్రె భాగాన్ని కత్తిరించి మెదడు నుంచి ముక్కులోకి అధికంగా ఉన్న తిత్తివంటి ఫ్లూయిడ్ భాగాన్ని తీసి తిరిగి కుట్లు వేశారు. ప్రస్తుతం ఒల్లీ పూర్తిగా కోలుకున్నాడు. నాలుగేళ్ళ తన అక్క అన్నతో హాయిగా ఆడుకుంటున్నాడు. అయితే చిన్నారికి భవిష్యత్తులో చికిత్సలు చేయాల్సి వస్తుందా లేదా అన్న విషయాన్నిప్రస్తుతానికి వైద్యులు నిర్థారించ లేదు. అతడి మెదడు పెరుగుదలను బట్టి భవిష్యత్ చికిత్స ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు