ఈ పాప సూపర్‌!

5 Aug, 2018 10:15 IST|Sakshi

చైనా జియాంగ్‌సూ ప్రావిన్స్‌లోని చాంగ్‌జో ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల పాప ఈ మధ్య బాగా ఫేమస్‌ అయిపోయింది. అందరూ ఆ పాపను సూపర్‌ గర్ల్‌ అని పిలుస్తున్నారు. అలా ఎందుకు పిలుస్తున్నారో తెలుసా.. ఆ పాప 17వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. అయ్యో..! అంతెత్తు నుంచి పడితే పాపం అనాల్సింది పోయి.. సూపర్‌ గర్ల్‌ అనడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే జరిగిన విషయం తెలిస్తే మీరు నోరు వెళ్లబెడతారు మరీ. అంతెత్తు నుంచి పడినా కూడా ఆ పాప.. చిన్న చిన్న గాయాలతో బయటపడటం ఓ అద్భుతం. ఆ పాప అమ్మమ్మ కూరగాయలు కొనేందుకు బయటికి వెళుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ పాపను వెంట తీసుకెళ్లాలని భావించినా అప్పుడు నిద్రపోతోంది.

దీంతో ఆ పాప నిద్ర లేచేసరికి తిరిగిరావొచ్చులే అని వెళ్లిపోయింది. ఆమె తిరిగొచ్చేలోపే ఆ పాప నిద్ర లేచింది. అమ్మమ్మ కనిపించకపోయేసరికి కిటికీలోంచి చూడాలనుకుంది. అక్కడున్న చిన్న టేబుల్‌ ఎక్కి తొంగిచూసింది. అంతే పట్టు జారడంతో అమాంతం ఆ 17వ అంతస్తు కిటికీలోంచి కిందపడిపోయింది. వెంటనే అక్కడున్న వారంతా హుటాహుటిన పాపదగ్గరికి వెళ్లేసరికి నెమ్మదిగా లేచి ఏడుస్తోంది. వెంటనే ఆ పాపను ఆస్పత్రిలో చేర్పించి అన్ని పరీక్షలు చేయగా.. ఎలాంటి ప్రమాదం లేదని, చిన్న చిన్న గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే 17వ అంతస్తు నుంచి పడినా కూడా ఏమీ కాకుండా ఉండటం చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అంతకుముందు రోజే భారీ వర్షం పడటం, పాప కింద పడేటప్పుడు చెట్ల కొమ్మల మధ్య నుంచి పడటం వల్ల ఏమీ కాలేదని విశ్లేషిస్తున్నారు. ఎంతయినా 17వ అంతస్తు నుంచి పడినా ఏం కాకపోవడం అద్భుతమే!

మరిన్ని వార్తలు