రన్‌వేపై.. వదల బొమ్మాళీ.. వదల..

28 Mar, 2018 03:02 IST|Sakshi

సమాధులెక్కడుండాలి.. 

ఉంటేగింటే.. శ్మశానంలో ఉండాలి.. 

మరి ఓ ఎయిర్‌పోర్టు రన్‌వే మధ్యలో ఉంటే.. 

ఎందుకలా? ఎక్కడలా? 

అమెరికాలోని సవన్నా నగరంలోని ఎయిర్‌పోర్ట్‌.. ఇక్కడి రన్‌వేపై రిచర్డ్, క్యాథరీన్‌ డాట్సన్‌ సమాధులుంటాయి.. ఫొటోలోని వృత్తంలో చూశారుగా.. అవే! సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టేటప్పుడు అవసరమైతే తగు పరిహారం ఇచ్చి ప్రైవేటు ఆస్తులను కూడా తీసుకుంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో అప్పట్లో ఇక్కడ చిన్నస్థాయి సైనిక ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిన అమెరికా ప్రభుత్వం.. ఇందుకోసం డాట్సన్‌ కుటుంబ సభ్యుల వ్యవసాయ భూమిని కూడా తీసుకుంది. 

అయితే, ఆ భూమిలోనే వీరి కుటుంబ సభ్యులు, వారి బానిసలకు చెందిన వందలాది సమాధులు ఉన్నాయి. దీంతో సైనికులు ఓ నాలుగు తప్ప మిగిలిన సమాధులను తవ్వి, వాటిని సమీపంలోని మరో శ్మశానానికి తరలించారు. అప్పట్లో వీటి వల్ల పెద్ద ఇబ్బంది లేకపోవడంతో వదిలేశారు. తదనంతర కాలంలో ఇది పౌర విమానాశ్రయంగా మారింది. 1970ల్లో రన్‌వేలను విస్తరించాలని నిర్ణయించారు. అయితే, రిచర్డ్, క్యాథరీన్‌ సమాధులు ఓ రన్‌వేకు మధ్యలో వచ్చేలా ఉన్నాయి. 

అక్కడి చట్టాల ప్రకారం వారి సంబంధీకులు ఒప్పుకుంటే తప్ప.. సమాధులను వేరే ప్రాంతానికి తరలించకూడదు. డాట్సన్‌ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో అవి ఉంటుండగానే.. రన్‌వే నిర్మాణం కానిచ్చేశారు.. దీంతో అవిలా రన్‌వే మధ్యలో మిగిలిపోయాయి. అలాగే అమెరికాలోని మాథిస్‌ ఎయిర్‌పోర్టు(ప్రస్తుతం ఇది పనిచేయడం లేదు) కూడా.. ఇక్కడైతే.. ఓ 20 మందివి ఉంటాయి. 1960ల్లో రన్‌వే కట్టినప్పుడు చనిపోయినవాళ్ల సంబంధీకులు వాటిని అలాగే ఉంచేయాలని కోరడంతో వాటి మీదుగానే రన్‌వే నిర్మించేశారు.  

 

మరిన్ని వార్తలు