టూత్‌పేస్ట్‌తో ఊపిరితిత్తుల వ్యాధులు దూరం!

18 May, 2018 17:01 IST|Sakshi

మిచిగాన్‌ : మనిషి ప్రతినిత్యం ఉపయోగించే వాటిలో టూత్‌పేస్ట్‌ది ఓ ప్రత్యేక స్థానం. నిజం చెప్పాలంటే టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకున్న తర్వాతే రోజు మొదలవుతుంది అందరికీ. ఇది కేవలం పళ్లని శుభ్రం చేయడానికే కాదు.. ప్రాణాంతక జబ్బులను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టూత్‌పేస్ట్‌లో ఊపిరితిత్తుల సంబంధమైన రోగాలతో పోరాడే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్నాయని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టూత్‌పేస్ట్‌లో ఉండే ట్రైక్లోసన్‌ బ్యాక్టీరియాను చంపుతుందని, దాన్ని టుబ్రామిసిన్‌ అనే యాంటీ బ్యాక్టీరియా జౌషదంతో కలిపినపుడు అది రోగ సంబంధ క్రిములను 99 శాతం చంపగలిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే సిస్టిక్ ఫైబ్రోసిస్‌(ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధి)ను నివారించగల్గిందని పేర్కొన్నారు.

అయితే టుబ్రామిసిన్‌ ఉపయోగించటం వల్ల దుష్ప్రభావాలు ఉండటంతో దీని వాడకాన్ని తగ్గించడం జరిగిందన్నారు. పూర్తిగా కాకుండా కొద్ది మొత్తంలో వాడటం ద్వారా వ్యాధి నివారణకు తోడ్పడుతుందన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగి పూర్తి స్థాయిలో నివారణ కనుక్కునే దిశగా అడుగులు వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే..?
ప్రాణాంతకమైన వ్యాధులలో ఇది ఒకటి. వంశపారపర్యంగా వచ్చే ఈ ఊపిరితిత్తుల వ్యాధి ప్రతి 3000 మందిలో కనిపిస్తుంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను చంపడం చాలా కష్టం. సూడోమోనాస్ ఎరుగినోస అనబడే ఈ బ్యాక్టీరియా బయోఫిల్మ్‌ రక్షణలో ఉండి మామూలు మందులతో నియంత్రణ కష్టంగా మారుతుంది. 

మరిన్ని వార్తలు