'కాలికి గన్ పెట్టి.. తల కూడా పేలుద్దన్నారు'

21 Jul, 2016 08:57 IST|Sakshi

కరాచీ: తాను ఉగ్రవాదుల నుంచి పారిపోదామనుకుంటే కాలికి గన్ పెట్టారని, తల పేలిపోద్ది అని బెదిరించారని పాకిస్థాన్లోని సింధు ప్రావిన్స్ చీఫ్ జస్టిస్ కుమారుడు అవాయిష్ అలీ షా చెప్పాడు. మరో ప్రయత్నం చేస్తే దారుణంగా కాల్చి చంపేస్తానని బెదిరించారని అన్నాడు. గత నెల (జూన్) 29న సింధు ప్రావిన్స్ చీఫ్ జస్టిస్ సజ్జాద్ అలీ షా కుమారుడైన అయాయిష్ ను తాలిబన్ ఉగ్రవాదులు పట్టపగలే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. పాక్ ఇంటెలిజెన్స్ విభాగం, ఆర్మీ కలిసి అతడిని ట్యాంక్ జిల్లాలో ఉగ్రవాదుల చెర నుంచి విడిపించారు. ఈ సందర్భంగా అతడి అనుభవాలు తెలియజేశాడు.

'ఆ రోజు నేను నా మిత్రుడిని కలిసి షాపింగ్ మాల్ కి వెళ్లి వస్తున్నాను. బయటకు రాగానే ముగ్గురు వ్యక్తులు నేరుగా నాపై దాడి చేశారు. గన్స్ పెట్టి కార్లోకి ఎక్కించారు. పారిపోదామని ప్రయత్నించేసరికి కాలికి గన్ పెట్టి అప్పటికప్పుడు కాల్చి పడేస్తామన్నారు. తల పేలిపోద్దంటూ హెచ్చరించారు. కరాచీలో ఈ విషయం తెలిసి సెక్యూరిటీ టైట్ చేయడంతో నన్ను పదిరోజులపాటు ఇక్కడే ఉంచి అనంతరం కళ్లకు గంతలు కట్టి ముసుగేసి దేరా ఇస్మాయిల్ ఖాన్ అనే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నన్ను వేరే గ్రూప్ కు అప్పగించారు. వారు అక్కడి నుంచి గిరిజన ప్రాంతమైన ట్యాంక్ జిల్లాకు కార్లోని వెనుక సీట్లో పడేసి తీసుకెళుతుండగా మన ఆర్మీ అనూహ్యంగా దాడి చేసి నన్ను విడిపించింది. వారంతో పాష్తో భాషను మాట్లాడుకున్నారు' అని చెప్పాడు.

కాగా, తన కుమారుడిని భద్రంగా విడిపించిన ఆర్మీకి చీఫ్ జస్టిస్ సజ్జాద్ ధన్యవాదాలు చెప్పాడు. ఈ క్రెడిట్ అంతా పాక్ ఇంటెలిజెన్స్ కే దక్కుతుందని చెప్పాడు. ఈ మొత్తం ఘటనపై నేడు అధికారులు సుప్రీంకోర్టులో నివేదిక ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు