అమెరికాను కుదిపేస్తున్న టోర్నడో

15 Apr, 2019 08:18 IST|Sakshi
టెక్సాస్‌లో టోర్నడో ధాటికి దెబ్బతిన్న ఇళ్లు

డాలస్‌: బలమైన గాలులు, వరదలతో అమెరికా దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. టెక్సాస్, మిస్సిసిపి, లూసియానా, అర్కాన్సాస్‌ రాష్ట్రాల్లో భారీ వర్షంతోపాటు బలమైన టోర్నడోలు ఏర్పడటంతో భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలడంతో పలు ప్రాంతాల్లో లక్షలాది ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. టెక్సాస్‌ రాష్ట్రం లుఫ్కిన్‌ పట్టణంలో ప్రయాణిస్తున్న కారుపై చెట్టు కూలడంతో అందులో ఉన్న ఇద్దరు చిన్నారులు(3, 8 ఏళ్లు) మృతి చెందారు. ముందు సీట్లో కూర్చున్న వారి తల్లిదండ్రులు సురక్షితంగా బయటపడ్డారు.

టెక్సాస్‌ సమీపంలోని ఫ్రాంక్లిన్‌ నగరంలో టోర్నడోల తాకిడికి పలు నివాసాలు ధ్వంసం కాగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మగ్నోలియా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. స్కార్క్‌విల్లే లోని మిస్సిసిపి స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన 21వేల మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టోర్నడోలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.

మరిన్ని వార్తలు