గబ్బిలాల దండయాత్రతో సిటీలో ఎమర్జెన్సీ!

26 May, 2016 07:19 IST|Sakshi
గబ్బిలాల దండయాత్రతో సిటీలో ఎమర్జెన్సీ!

లక్ష గబ్బిలాలు ఒక్కసారిగా నగరంపై దండయాత్ర చేస్తే ఎలా ఉంటుంది. హర్రర్‌ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది కదా! ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ రాష్ట్రంలోని బాటెమన్స్‌ బే నగరంపై ఒక్కసారిగా గబ్బిలాలు విరుచుకుపడ్డాయి. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని విధించారు.

నగరంలోని ప్రతి చెట్టుకూ, ప్రతి ఇంటికి పైకప్పునకు గబ్బిలాలు కుప్పలుతెప్పలుగా వేలాడుతుండటంతో అధికారులు బాటెమన్స్‌ బే వాసులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని, తలుపులు, కిటికీలు మూసుకొని భద్రంగా ఉండాలని సూచించారు. గబ్బిలాల రాకతో పట్టణమంతా గందరగోళంగా మారిపోయింది. 'నేను కిటికీ తలుపులు తీయలేని పరిస్థితి నెలకొని ఉంది. తడి దుస్తులు ఆరుబయట ఆరేద్దామన్న వీలుకావడం లేదు. గబ్బిలాలు చేసే రోదతో ఇంట్లో ప్రశాంతంగా ఉందామన్నా, చదువుకుందామన్నా కుదరడం లేదు' అని డానియెల్ స్మిత్ వాపోయాడు.

నగరంలోని ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఫ్లయింగ్ ఫాక్స్‌ టాస్క్‌ ఫోర్స్‌.. 'గతంలో ఎన్నడూ ఊహించని విపత్కర పరిస్థితి ఇది. ఇంత పెద్దమొత్తంలో గబ్బిలాలు రావడం గతంలో ఎన్నడూ చూడలేదు' అని ఒక ప్రకటనలో పేర్కొంది.

గబ్బిలాలు అంతరించిపోయే ప్రాణులు జాబితాలో ఉండటంతో అధికారులు వాటిని చంపలేని పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పొగపెట్టి, శబ్దాలు చేస్తూ వాటిని తరిమేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు