65 లక్షల టయోటా కార్ల రీకాల్

21 Oct, 2015 13:38 IST|Sakshi
65 లక్షల టయోటా కార్ల రీకాల్

టోక్యో: జపాన్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ 'టయోటా' 6.5 మిలియన్ వాహనాలను వెనక్కి తీసుకుంటోంది. ఆ సంస్థ వాహనాల తయారీలో చిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్ని ప్రమాదం బారినపడే అవకాశం ఉన్నందున  ఈ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ ప్రక్కగా ఏర్పాటు చేసిన పవర్ విండో మాస్టర్ స్విచ్లో సమస్యలు  గుర్తించినట్లు టయోటా కంపెనీ తెలిపింది. మాస్టర్ స్విచ్ మెల్ట్ అయి మంటలు వ్యాపించే ప్రమాదం ఉన్నందున వాహనాలను వాపసు తీసుకుంటున్నట్లు టయోటా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ తరహాలో ఎలాంటి ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాకున్నా.. ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు టయోటా తెలిపింది.


ఇటీవలి కాలంలో టయోటా వాహనాల 'ఎయిర్ బ్యాగ్'లలో సమస్యలు తలెత్తడంతో 10 మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వెనక్కి తీసుకుంటున్న వాహనాలు 2005 నుండి 2010 మధ్య కాలంలో విక్రయించిన యారిస్, కొరోల్లా, కామ్రి లతో పాటు ఆర్ఏవీ4 తరహా మోడల్ వాహనాలు ఉన్నాయి. ఈ మోడల్ వాహనాలను ఎక్కువగా ఉత్తర అమెరికా, బ్రిటన్లో విక్రయించినట్లు టయోటా తెలిపింది.
 

>
మరిన్ని వార్తలు