క్షురకర్మ పండగ

28 Jun, 2015 01:52 IST|Sakshi
క్షురకర్మ పండగ

చారిత్రక ‘మాచు పిచ్చు’ ప్రదేశమే కాదు, పెరూ దేశంలో చూడదగ్గ మరో ఉత్సవం ‘చాచు’. ‘ఇన్కా’ సామ్రాజ్యం నుంచీ కొనసాగుతున్న ఈ ఉత్సవంలో సింపుల్‌గా చేసేది ‘వికునా’ల క్షురకర్మ. వికునాలంటే దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే అరుదైన పొట్టిరకం అడవి ఒంటెలు. వికునా ఉన్ని అతి శ్రేష్టమైనది. అయితే ఏడాదికి దాని ఉన్ని అరకిలోకు మించదు. ఒకప్పుడు ఇన్కా రాజులు, రాణులు మాత్రమే ఆ ఉన్నితో తయారైన వస్త్రాలు ధరించేవారు. సాధారణ మనుషులు వాటిని ధరించడం మీద నిషేధం ఉండేది.

వికునా ఉన్నితో చేసిన ఒక కోటు ప్రస్తుతం సుమారు 30 వేల డాలర్లకు అమ్ముడుపోతుంది. ఇంత ఖరీదైనది కాబట్టే దానికి అనుగుణమైన వేట సాగేది. కాబట్టి  ఉన్ని సేకరణను ప్రభుత్వం నియంత్రిస్తోంది. అయితే ‘చాచు’ పండగను మాత్రం పాతకాలంలోలాగే జరుపుతోంది. ఏడాదికి ఒకమారు వందలాదిమంది ‘ఇన్కా’ సంప్రదాయ వేషధారణలో వాటిని చుట్టుముట్టి ఒకచోటికి తరలేలా చేస్తారు. ఈ మొత్తం తతంగాన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా ఒకరు రాజు వేషాన్ని కూడా ధరిస్తారు. అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి, శుభ్రంగా బొచ్చుగొరిగి, తిరిగి జాగ్రత్తగా వికునాలను అడవిలోకి వదిలేస్తారు.

మరిన్ని వార్తలు