కుదిపేస్తున్న సరికొత్త ట్రెండ్‌ ‘ట్రేడ్‌వైఫ్‌’

21 Jan, 2020 14:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆనాటి రోజులు తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంది. పొద్దు పొద్దున్నే లేచి ఇల్లూ వాకిలి తుడిచి, కల్లాపి చల్లి, ముగ్గులేయడం, గుప్పు గుప్పుమంటూ ముక్కు పుటాలు అదరగొట్టే వేడి వేడి కాఫీ తాగడం, పెరట్లోకి వెళ్లి పేరుకుపోయిన వంట పాత్రలను శుభ్రంగా తోమేయడం, అప్పుడే లేచి పాల కోసం ఏడుస్తున్న చంటోడిని చక్కనేసుకొని పాల పీక నోట్లో పెట్టడం, చిట్టి కన్నా! అంటూ వాడి కన్నీళ్లను తుడుస్తుంటే అందుకు కతజ్ఞతగా వాడు ఆత్మీయంగా నాకేసి చూడడం, ఇంకేమి భయం లేదన్నట్లు మగతలోకి జారుకుంటున్న వాడిని పడుకోపెట్టడం, మిగిలిన చిల్లర పనులు పూర్తిచేసి గబగబా టిఫిన్‌ తయారు చేయడం, ఇంటిల్లిపాది కలిసి ఆరగించి వసారాలో కాసేపు సేద తీరడం, ఆ తర్వాత రెండు, మూడు గంటలు భోజన ఏర్పాట్లలో తలమున్కలై ఉండడం, ఇంటిల్లి పాదికి కొసరి కొసరి వడ్డించి మెప్పులు, అప్పుడప్పుడు వడ్డింపులు పొందడం ఎంత హాయి! సాయం సంధ్య వేళల్లో పెరట్లోని మల్లె చెట్టు వద్దకెళ్లి విరిసీ విరయని మొగ్గల్ని తెంపి, వాటిని దండగా కూర్చి నెత్తిలో పెట్టుకోవడం, ఏవో తీయని తలపులతో బుగ్గలు ఎరుపెక్కడం, అరుగున చేరి ఇరుగుపొరుగు వారితో పిచ్చాపాటి మాట్లాడుకోవడం అబ్బా ఎంత హాయి!....ఆనాటి రోజులు తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతోంది’

అచ్చం ఇలాగే కాకపోయినా ఇలాంటి భావమే బ్రిటన్‌కు చెందిన అలెనా కేట్‌ పెటిట్‌కు కలిగింది. 1950, 60వ దశకాల్లో భారత దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా మహిళలు ఎక్కువగా వంటావార్పుకే పరిమితం అయ్యేవారు. ఆర్థిక స్వాతంత్య్రం కోసం ఆకాశంలో సగమన్న మహిళలు హక్కుల కోసం ఉద్యమించి ఆధునిక మహిళలుగా మారారు. మగవాళ్లతోపాటు సమానంగా ఆఫీసులకు వెళ్లడం, ఇంటి పనిని, వంట పనిని కొంచెం అటూ ఇటుగా పంచుకోవడం లేదా పని మనుషులను పెట్టుకోవడం పరిపాటయింది. అలా ఎదిగిన ఆధునిక మహిళే అలెనా. ఆమెకు హఠాత్తుగా 1950, 60వ దశకం నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆనందం లాంటి విచారానికి గురయ్యారు. విచారం ఎందుకు? ఆనాటి ఆనందం కోసం మళ్లీ ‘ఇంటికి దీపం ఇల్లాలు’ కావాలనుకున్నారు. చేస్తున్న ఉద్యోగం వదిలేశారు. గరిట పుచ్చుకున్నారు. వంటావార్పు మొదలు పెట్టారు. సమీపంలో ఉన్న ఫుడ్‌ కోర్టుకు కూడా రుచికరమైన ఆహార పదార్థాలను సరఫరా చేసి ఆర్థికంగా కూడా బాగానే సంపాదిస్తున్నారు. 

అంతటితో ఆగకుండా ఆమె ‘ది డార్లింగ్‌ అకాడమీ’ అనే పేరుతో ఓ ‘వ్లోగ్‌’ను నడుపుతున్నారు. వంటావార్పులో ఉన్న సంతప్తిని తోటివారితో పంచుకోవడం మొదలు పెట్టారు. ఏ రకమైన కూరలు ఎలా వండాలో కూడా చిట్కాలిస్తున్నారు. ఆమె ‘వ్లోగ్‌’ పాఠకులతో ప్రారంభమైన ఈ సరికొత్త (పాత) ఉద్యమం ఇప్పుడు బ్రిటన్‌ అంతటా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యమం ‘ట్రేడ్‌వైఫ్‌’ పేరిట అమెరికా సోషల్‌ మీడియాలో ఊపందుకుని అక్కడి ప్రధాన జన జీవన స్రవంతికి విస్తరించింది. జర్మనీ, జపాన్‌ దేశాలకు కూడా విస్తరిస్తోంది. కొందరు 1950, 60 దశకం నాటి వంటావార్పు పుస్తకాలను వెలికి తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. అప్పట్లో వంట చేసే మహిళలు అందుకు అనువైన దుస్తులు ధరించే వారంటూ నాటి పొడువాటి దుస్తుల ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. 

మహిళలు కొంత లొంగిపోయి ఉంటేనే పెళ్లి పెటాకులు కాకుండా నిత్య కళ్యాణం అవుతుందంటూ అమెరికా రచయిత్రి హెలెన్‌ ఆండెలిన్‌ రాసిన ‘ఫాసినేటింగ్‌ విమెన్‌వుడ్‌’ పుస్తకం దుమ్ము దులిపి మళ్లీ చదువుతున్నారు.  ఆ ‘పాత’ మధురం అంటున్నారు. స్రీవాదం పేరిట ‘ఫెమినినిటి క్లాస్‌’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా లక్షకుపైగా అభిమానులను కలిగిన హెలెన్‌ ఆండెలిన్‌ కూతురు డిక్సీ ఆండెలిన్‌ ఫోర్సిత్‌ ఈ ‘ట్రేడ్‌వైఫ్‌’ ఉద్యమాన్ని సమర్థించడం విశేషం. బ్రిటన్, ఇతర యూరప్‌ దేశాల్లో మహిళలు ఇప్పటికే ఫెమినిజం సాధించినందున ఇలాంటి ఉద్యమాల వల్ల నష్టమేమి లేదన్నారు. అలెనాతో ఏకీభవిస్తున్న వారితోపాటు విభేదిస్తున్న వారూ లేకపోలేదు.

‘స్త్రీ వాదం’ నుంచి ‘మీటూ’ ఉద్యమం వరకు దూసుకొచ్చిన మహిళలను మళ్లీ వెనక్కి వెళ్లమనడం మూర్ఖత్వం అని కొంత మంది అలెనాపై విరుచుకుపడుతున్నారు. అందుకు సమాధానంగా ‘నేను ఇప్పటికీ స్త్రీవాదినే. ఆ విషయంలో నేనేమీ మారి పోలేదు. అన్ని ఉద్యోగాలు చేసినట్లే ఇంట్లో వంటావార్పు చేసుకునే హక్కు మహిళలకు ఉండాలని కోరుతున్నాను. అందర్ని వంట చేయమని నేను కోరడం లేదు. ఇదొక ఆప్షన్‌గా ఉండాలంటున్నాను. ఇందులో ఉన్న ఆనందం, సంతృప్తి గురించి చెబుతున్నాను. ఇది నిస్వార్థంగా కుటుంబంపై ఓ మహిళ పెట్టే పెట్టుబడి. ఆఫీసులకెళ్లే భార్యాభర్తలు ఇప్పటికే కలసి వంట చేసుకుంటున్నారు. మహిళలు ఇష్టపడి ఇంటికి పరిమితమయితే తప్పులేదంటున్నాను. పైగా కుటుంబ బంధాలు బలపడే అవకాశం ఉంది’ అని వాదిస్తున్నారు. 

అలెనా సంగతి పక్కన పెడితే ‘ఏ విమెన్స్‌ ప్లేస్‌ ఈజ్‌ ఇన్‌ ది హోమ్‌ (మహిళలు ఇంటికే పరిమితం), ట్రయింగ్‌ టూ బీ ఏ మ్యాన్‌ ఈజ్‌ వేస్ట్‌ ఆఫ్‌ విమెన్‌ (మహిళలు మగవాళ్లుగా మారాలనుకోవడం వ్యర్థం)’ అనే కొటేషన్లు ఈ ట్రేడ్‌వైఫ్‌ ఉద్యమం నుంచి కొత్తగా పుట్టుకొచ్చాయి. 

మరిన్ని వార్తలు