గల్ఫ్‌ గోస; ఓ భారతీయురాలి దీనగాథ

11 Jun, 2018 16:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అరబ్‌ దేశమైన ఓమన్‌ రాజధాని మస్కట్‌ నగరంలో మే నాలుగవ తేదీన ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న 38 ఏళ్ల శీజా దాస్‌ తన యజమానురాలు పెడుతున్న చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా రెండంతస్తుల మేడ మీది నుంచి దూకేశారు. దాంతో ఆమెకు వెన్నుముకతోపాటు రెండు కాళ్లు విరిగాయి. ఎడమ వైపు నడుము నుంచి పాదం వరకు శరీరం పూర్తిగా చచ్చుపడి పోయింది. ఓమన్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం ఆమెను మే 26వ తేదీన భారత్‌లోని కేరళకు పంపించారు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురం జిల్లా, చిరాయింకీజు గ్రామంలోని చిన్న ఇంటిలో జీవచ్చవంలా రోజులు లెక్కపెడుతోంది. కదలలేని మెదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెకు ఆమె భర్త బిజుమన్‌ సదాశివన్‌ సపర్యలు చేస్తున్నారు. శీజా దాస్‌ ఇంతటి దుస్థితికి కారణమైన ఆమె యజమానురాలి నుంచి మాత్రం ఆమెకు నష్టపరిహారంగా ఒక్క పైసా రాలేదు. అందుకు ప్రస్తుత భారత ప్రభుత్వం కారణమవడం బాధాకరం.

నేడు శీజా దాస్‌కు జరిగిన అన్యాయం.. 2015లో తమిళనాడుకు చెందిన 58 ఏళ్ల కస్తూరి మునిరత్నంకు సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఎదురైన దారుణాన్ని గుర్తుచేస్తోంది. అతి తక్కువ డబ్బులకు తనతో అరవచాకిరి చేయిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు యజమాని ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినందుకు 2015, అక్టోబర్‌ 8వ తేదీన ఆమె కుడిచేతిని ఇంటి యజమాని నరికేశారు. ఈ సంఘటనపై నాడు భారత విదేశాంగ మంత్రి  సుష్మా స్వరాజ్‌ వార్త తెల్సిన మరుక్షణమే ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆమె అక్టోబర్‌ 9వ తేదీన తొమ్మిది గంటల ప్రాంతంలో ట్వీట్‌ చేశారు.

ఎవరిని కదిలించినా కన్నీళ్లే: ‘గల్ఫ్‌ కోపరేషన్‌ కౌన్సిల్‌ కంట్రీస్‌’గా పిలిచే ఓమన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాల్లో దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు పని మనుషులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిలో శీజా దాస్, మునిరత్నంలాంటి బాధితులు కూడా వేలల్లో ఉంటారని అక్కడి భారతీయ సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఉన్న ఉద్యోగం ఊడిపోతుందని, ప్రాణాలకే ముప్పు ముంచు కొస్తోందనే భయంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయరని వారు చెబుతున్నారు.

పస్తులు, వీపు దెబ్బలు
శీజా దాస్‌ 2016వ సంవత్సరం నుంచి మస్కట్‌లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిచేస్తున్నారు. అదే యజమాని కింద 2013 నుంచి ఆమె భర్త శివదాసన్‌ పనిచేస్తుండడంతో తన జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని శీజా భావించారు. ఇద్దరి జీతాల నుంచి కూడ బెట్టుకున్న సొమ్ముతో ఓ చిన్న ఇల్లు కూడా కట్టుకోవచ్చని వారు కలలుగన్నారు. గత వేసవి సెలవుల్లో వారు తమ ఇద్దరు పిల్లల (13 ఏళ్ల శ్రీరప్, రెండేళ్ల శోభిత్‌)ను తీసుకొని మస్కట్‌ వెళ్లారు. ఎంత పనిచేసినా సరిగ్గా పనిచేయడం లేదంటూ ఇంటి యజమానురాలు కర్రతో ఎప్పుడూ శీజా వీపుపై బాదేదట. పస్తులు ఉంచేదట. మే నాలుగవ తేదీన ఏదో సాకుతో చితకబాదడం మొదలు పెట్టిందట. ఎంత వేడుకున్నా వదిలి పెట్టలేదట. తరిమి తరిమి కొట్టిందట. ఆ దెబ్బలను తప్పించుకునేందుకు రెండో అంతస్తు మేడ మీదకు పరుగెత్తిందట. అయినా వెంటపడడంతో తప్పించుకునేందుకు మరో మార్గం లేక కిందకు దూకేసిందట. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మస్కట్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారట.

మస్కట్‌కు రాకముందు తన భార్య శీజా 48 కిలోల బరువు ఉండేదని, ఆస్పత్రిలో చేరనాటికి ఆమె బరువు 30 కిలోలే ఉందని భర్త శివదాసన్‌ తెలిపారు. తన భార్యకు నెలకు 50 ఓమన్‌ రియల్స్‌ (8,750 రూపాయలు) ఇస్తానన్న హామీతో పనిమనిషిగా ఉద్యోగంలో పెట్టుకున్నారని, యజమాని ప్రతి నెల ఆమె బ్యాంక్‌ ఖాతాలో ఆ జీతం మొత్తాన్ని జమచేసి మళ్లీ అదే రోజు విత్‌డ్రా చేయించి తీసుకునే వారని ఆయన తెలిపారు (అక్కడ పని మనుషుల జీతాలను తప్పనిసరిగా బ్యాంకుల ద్వారానే చెల్లించాలి). అంతా కలిపి మళ్లీ భారత్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తానని చెప్పేవారని, అనుమానం ఉన్నా చేసేదేమీ లేక ఊరుకున్నామని ఆయన చెప్పారు. తనకు మాత్రం నెలకు 17,500 రూపాయలు వచ్చేదని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన తన భార్యకు నష్టపరిహారం చెల్లించకపోగా, జీతంగా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

భారత్‌కు పంపించేందుకు తన భార్య శీజాకు మాత్రమే తమ యజమాని విమాన టిక్కెట్టు కొన్నారని, తనకు, తమ పిల్లలకు కొనలేదని శివదాసన్‌ తెలిపారు. వీరి పరిస్థితి గురించి ఓమన్‌లో సామాజిక, సాంస్కతి సంస్థగా రిజిస్టర్‌ అయిన ‘ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌’ అధ్యక్షుడు, ‘కేరళ నాన్‌ రెసిడెంట్‌ కేరలైట్స్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌’ డైరెక్టరయిన పీఎం జబీర్‌ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్‌ చేశారు. ఆమె ఆదేశం మేరకు మస్కట్‌లోని భారతీయ ఎంబసీ జోక్యం చేసుకొని బిజూమన్, ఇద్దరు పిల్లలకు కూడా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసి భారత్‌కు పంపించారు. ఒక్క నయాపైసా కూడా యజమాని నుంచి శీజాకు రాలేదు.


చట్టాలు ఏమి చెబుతున్నాయి?
విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం కోసం 2011లో విదేశాల్లో భారతీయుల వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంది. వాటిల్లో షరతులు, మార్గదర్శకాలు ఉన్నాయి. భారతీయులను పని మనిషిగా పెట్టుకునే విదేశీ యజమానికి నెలకు కనీసం 2,600 డాలర్ల ఆదాయం ఉండాలి. సదరు యజమాని ఒక్కో పని మనిషికి 2,850 డాలర్ల (దాదాపు రెండు లక్షల రూపాయలు) చొప్పున భారత అంబసీకి బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాలి. దీన్ని అంబసీ సెక్యూరిటీ డిపాజిట్‌గా పరిగణిస్తుంది. యజమాని జీతాలు చెల్లించనప్పుడు, న్యాయపరమైన పోరాటం అవసరమైనప్పుడు, నష్టపరిహారం కోసం బాధితుడికి అంబసీ ఈ సొమ్మును ఖర్చు పెడుతుంది. ఇక నెలకు కనీస జీతాన్ని 280 డాలర్లు (దాదాపు 18,800 రూపాయలు)గా నిర్దేశించింది. అంతేకాకుండా యజమాని ఉచిత భోజన సౌకర్యంతోపాటు ఉచిత వసతి కూడా కల్పించాలని షరతు విధించింది.  ప్రీ పెయిడ్‌ సిమ్‌ కార్డుతో మొబైల్‌ ఫోన్‌ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఏడాదికోసారి భారత్‌ వచ్చిపోయేందుకు ప్రయాణ ఖర్చులు భరించాలి. 2015లో భారత ప్రభుత్వం ఈమ్రైగ్రేషన్‌ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. పని మనుషులకు సంబంధించిన అన్ని వీసా కార్యకలాపాలు ఈ వెబ్‌సైట్‌ ద్వారానే నిర్వహించాలి.

నష్టపరిహారం ఎత్తివేశారు
విదేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండంతో భారతీయ అంబసీ కోరుతున్న బ్యాంక్‌ గ్యారంటీ అందుకు కారణం అవుతుందని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో గల్ఫ్‌తోపాటు మొత్తం 18 దేశాల్లో ఈ షరతు ఎత్తివేసింది. పర్యవసానంగా నేడు శీజా దాస్‌కు నష్టపరిహారం అందకుండా పోయింది. ‘ఇంటి కల ఎలాగు చెదిరిపోయింది. నా వైద్యానికి ఉన్నదంతా ఖర్చయిపోయింది. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఇక నేనా లేవలేను. నేను ఎప్పుడు కన్నుమూసినా ఫర్వాలేదు. కానీ ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత, బరువు నా భర్తపై పడింది. ఎలా నెట్టుకొస్తాడో ఏమో’ అంటూ ఆమె మీడియాతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో భారతీయ పని మనుషులకు సరైన భద్రత కల్పించాలి. లేకపోతే శీజా లాంటి కథలు వింటూనే ఉంటాం’ అని పీఎం జబీర్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు