శరణార్థుల ‘సంరక్షణ నగరాలు’!

15 Apr, 2019 04:01 IST|Sakshi

అక్రమవలసదారులను తరలించే విషయంలో పునఃయోచన

ఇప్పటికే రెండుసార్లు తిరస్కరణకు గురైన ప్రతిపాదన

అయినా ఇంకా పరిశీలనలోనే ఉందన్న ట్రంప్‌  

వాషింగ్టన్‌/ఫోనిక్స్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకునే నిర్ణయం అక్రమ వలసదారులకు సానుకూలంగా ఉండేలా కనిపిస్తోంది. వలసదారులను సంరక్షణ నగరాలకు (శాంక్చురీ సిటీస్‌) పంపే యోచనను ట్రంప్‌ తీవ్రంగా చేస్తున్నారు. ఈ సంరక్షణ నగరాలకు ప్రజలను పంపడం ద్వారా వారు అమెరికాలోనే ఉండేందుకు అవకాశం కలగనుంది. తమపై నమోదైన వలస కేసులకు సంబంధించి మరింత ఎక్కువగా న్యాయ సహాయం పొందే అవకాశం కూడా అక్రమ వలసదారులకు కలుగుతుంది. షికాగో, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో న్యాయ నిపుణులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఈ సంరక్షణ నగరాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉండనుండటం అక్రమ వలసదారులకు ప్రతికూలాంశం.

అదే సందర్భంలో ఇతర నగరాల్లోని అక్రమ వలసదారులతో పోలిస్తే సంరక్షణ నగరాల్లో నివసించే అక్రమ వలసదారులు అరెస్టయ్యే అవకాశాలు 20 శాతం తక్కువ. శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ న్యాయవాది జార్జ్‌ గాస్కన్‌ మాట్లాడుతూ సంరక్షణ నగరాల్లోని అక్రమ వలసదారులు నేరాలకు పాల్పడేందుకు అవకాశం తక్కువనీ, అయితే ఇది రాజకీయ ప్రేరేపణతో తీసుకున్న, ప్రజల జీవితాలతో ఆడుకునే నిర్ణయమని అన్నారు. మెక్సికో సరిహద్దు నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశిస్తుండటం ట్రంప్‌ను తీవ్రంగా కలవరపెడుతుండటం తెలిసిందే. అక్రమవలసదారులను సంరక్షణ నగరాలకు తరలించాలన్న ప్రతిపాదన పాతదే. ఇప్పటికే రెండుసార్లు ట్రంప్‌ యంత్రాంగం దీనిని తిరస్కరించింది. అయితే ట్రంప్‌ శుక్రవారం ఓ ట్వీట్‌ చేస్తూ ఈ ప్రతిపాదన ఇంకా తమ పరిశీలనలో ఉందని వెల్లడించడం గమనార్హం. మరోవైపు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ మాట్లాడుతూ అక్రమ వలసదారుల విషయంలో తమ ముందు ఉన్న అనేక మార్గాల్లో ఈ సంరక్షణ నగరాలు ఒకటి మాత్రమే పేర్కొన్నారు.  

ఏమిటీ సంరక్షణ నగరాలు?
సంరక్షణ నగరాలకు ప్రత్యేకంగా నిర్వచనమేదీ లేదు. ఒక్కమాటలో స్థూలంగా చెప్పాలంటే కొన్ని అంశాల్లో, ప్రత్యేకించి అక్రమ వలసల విషయాల్లో స్థానిక పోలీసులు అమెరికా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించలేరు. దీనిపై పరిమితులుంటాయి. అక్రమవలసదారులను నిర్బంధించాలని అమెరికా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోరినా దాదాపు 200 పట్టణాలు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. అంటే అవి సంరక్షణ పట్టణాల కిందకు వచ్చినట్లే. న్యూయార్క్, షికాగో, లాస్‌ ఏంజిలస్, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు