అమెజాన్‌పై ట్రాన్స్‌జెండర్‌ కేసు

10 Aug, 2017 11:43 IST|Sakshi
అమెజాన్‌పై ట్రాన్స్‌జెండర్‌ కేసు

కెంటకి: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్ధ అమెజాన్‌ పై ఓ ట్రాన్స్‌జెండర్‌ మహిళ కేసు వేసింది. తనను, తన భర్తను మానసికంగా వేధించటంతోపాటు, తమపై హత్యాయత్నం చేశారంటూ ఆమె ఆరోపణలు చేసింది. కెంటకిలోని వేర్‌హౌజ్‌ రిటైలర్‌లో అలెగ్రా ష్కావే లేన్‌, ఆమె భర్త డేన్‌ లేన్‌లు పని చేసేవారు. ఆ సమయంలో సహోద్యోగులు తమపై లింగ వివక్షత చూపేవారని ఆ జంట తెలిపింది.

వారి లైంగిక జీవితంపై తరచూ కామెంట్లు చేస్తూ వేధించేవారన్నారు. ఈ విషయాన్ని స్టోర్‌ సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకెళ్లగా అతను కూడా ఉద్యోగులతో జత కలిసి తమను మానసికంగా క్షోభకు గురి చేశారని వాపోయారు. వారిద్దరిపై ఓ కన్నేసి ఉంచండంటూ తమ ముందే తోటివారితో చెబుతుండేవారని, ఒకసారి కారు బ్రేక్‌లు తీసేసి తమను చంపే యత్నం కూడా చేశారని పేర్కొన్నారు.

అమెజాన్‌పై ఇలాంటి ఆరోపణలు రావటంపై పలువురు మండిపడుతున్నారు.  గతంలో ఫెడరల్‌ కోర్టులు ఇలాంటి కేసులను తీవ్రంగా పరిగణించాయని, లింగ వివక్షతకు పాల్పడిన సూపర్‌వైజర్‌తోపాటు కంపెనీపైనా చర్యలు తప్పవని అలెగ్రా తరఫు న్యాయవాది జిల్లియన్‌ వెయిస్స్‌ చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారంపై స్పందించేందుకు అమెజాన్‌ విముఖత వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు