ఇవే మా ఆఖరి క్షణాలు.. గుడ్‌ బై

27 Mar, 2018 19:10 IST|Sakshi
అగ్ని ప్రమాదం జరిగిన రష్యాలోని షాపింగ్‌ మాల్‌

ఇదే మా చివరి పోస్ట్‌ అంటూ సోషల్‌ మీడియాలో వీడ్కోలు

రష్యా : ‘మేం చనిపోతున్నాం.. ఇక ఇవే మా చివరి క్షణాలు.. మీ అందరికీ గుడ్‌ బై’ అంటూ రష్యాలోని కెమెరావో నగరంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన షాపింగ్‌ మాల్‌ అగ్నిప్రమాదంలో మరణించిన 30 మంది విద్యార్థులు జీవితంలో వారి ఆఖరి క్షణాల్ని సోషల్‌ మీడియాలో తమ తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్‌తో పంచుకున్నారు. ‘మేమంతా మంటల్లో కాలిపోవడానికి ఇంకొన్ని క్షణాలే మిగిలాయి. బహుశా ఇవే మా వీడ్కోలు మాటలు కావచ్చు’ అని 13 ఏళ్ల మరియా సోషల్‌ మీడియాలో తన చివరి పోస్ట్‌ చేసింది.  

ఈ మేరకు ‘రష్యా-24’ టీవీ చానల్‌ మంటల్లో చిక్కుకున్న విద్యార్థుల ఆర్తనాదాలు సోషల్‌ మీడియా సాక్షిగా వ్యక్తమయ్యాయని తెలిపింది. మంటల్లో చిక్కుకుని చనిపోయిన వారి పక్కా సమాచారమేదీ తెలియరాలేదని ఆ చానల్‌ పేర్కొంది.  చనిపోయిన వారి పేర్లలో తమ పిల్లల పేర్లు ఉండకూడదని తల్లిదండ్రులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారని చెప్పింది. కాగా ఇంత పెద్ద ప్రమాదం జరిగినా నగరంలోని అత్యవసర  సేవల వ్యవస్థ నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. 

సరదాగా సినిమాకు..
సెలవుల అనంతరం స్కూల్‌ మొదలు కావడంతో సరదాగా పిల్లలందర్నీ సినిమాకు పంపించామని ట్రెస్‌చెవ్‌స్కీ స్కూల్‌ డైరెక్టర్‌ పావెల్‌ ఓరిన్స్కీ తెలిపారు. ట్రెస్‌చెవ్‌స్కీ పట్టణంలోని పాఠశాల నుంచి ఒకే తరగతికి చెందిన విద్యార్థులంతా సినిమా కోసం ఆదివారం మధ్యాహ్నం కెమెరావోలోని షాపింగ్‌ మాల్‌కు వచ్చి అగ్నిప్రమాదం బారినపడ్డ విషయం తెలిసిందే. అయితే సినిమా చూస్తున్న విద్యార్థుల్లో చాలామంది ఈ ప్రమాదంలో మరణించినట్లు వార్తలొస్తున్నాయి.

అమ్మకు నా మరణవార్త తెలుపు..
‘ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది. థియేటర్‌ డోర్లన్నీ మూసుకుని ఉన్నాయి. మేమంతా లోపలే ఉన్నాం. ట్రెస్‌చెవ్‌స్కీ స్కూల్‌ విద్యార్థులమంతా ఇక్కడే ఇరుక్కుపోయాం. నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను’ అని తన మేనకోడలు వికా చేసిన చివరి ఫోన్‌ కాల్‌ను గుర్తుచేసుకుంటూ..  ఆమె మేనత్త యెవ్‌జెనియా కంటతడి పెట్టింది. ‘అత్తయ్యా నాకు అమ్మం‍టే చాలా ఇష్టం, ప్రేమ..  ఆమెకు ఈ విషయాన్నిఅందజేయి’  అంటూ వికా పలికిన చివరి మాటల్ని చెప్తూ యెవ్‌జెనియా కన్నీరు మున్నీరైంది.

సెక్యూరిటీ గార్డ్‌ అలారం ఆఫ్‌ చేశాడు..
ప్రమాదంపై ఏర్పాటైన విచారణ కమిటీ ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన భవన సముదాయానికి సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదన్నారు. అక్కడ నియమాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ విషయమై కమిటీ విచారణ చేస్తోందని తెలిపారు. ఫైర్‌ ఎగ్జిట్‌ మార్గాలు మూసేసి ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలు అంటుకోగానే అలారం మోగిందనీ.. అయితే  అక్కడ పనిచేసే ఒక ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్‌ దానిని ఆఫ్‌ చేశాడని తెలిపారు. ఇంతటి ఘోరమైన తప్పిదాలు ఉన్నందునే మృతుల సంఖ్య పెరిగిందని అన్నారు.

మరిన్ని వార్తలు