9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు

1 Sep, 2019 03:55 IST|Sakshi
ఖలీద్‌ షేక్‌ (ఫైల్‌)

2021 జనవరి 11 నుంచి మొదలు

దాదాపు 20 ఏళ్ల తర్వాత విచారణ

వాషింగ్టన్‌: 2001లో అమెరికాలోని వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడి కుట్రదారులపై విచారణ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఈ కేసును 2021లో చేపట్టనున్నట్లు మిలటరీ కోర్టు జడ్జి ఎయిర్‌ఫోర్స్‌ కల్నల్‌ డబ్ల్యూ షేన్‌ కోహెన్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 11 ఉగ్రదాడులకు వ్యూహ రచనతోపాటు అమలు చేసినందుకు యుద్ధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ప్రస్తుతం అమెరికా వైమానిక స్థావరం గ్వాంటానమో బే జైలులో ఉన్నారు. వీరిపై 2021 జనవరి 11వ తేదీ నుంచి అక్కడే విచారణ మొదలవుతుందని ఆయన ప్రకటించారు. వీరిని 2002–2003 సంవత్సరాల్లో అమెరికా పాకిస్తాన్‌లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి పలు రహస్య ప్రాంతాల్లో ఉంచి, విచారణ జరిపింది.

చివరికి 2006లో గ్వాంటానమో బే జైలుకు తరలించింది.  మిలటరీ చట్టాల ప్రకారం వీరిపై నేరం రుజువైతే మరణశిక్ష పడే అవకాశాలున్నాయి. నిందితుల్లో సెప్టెంబర్‌ 11 దాడులతోపాటు ఇతర ఉగ్రచర్యలకు కుట్రపన్నిన అల్‌ ఖైదా సీనియర్‌ నేత ఖలీద్‌ షేక్‌ మొహమ్మద్, వలిద్‌ బిన్‌ అటాష్, రంజీ బిన్‌ అల్‌ షిబ్, అమ్మర్‌ అల్‌ బలూచి, ముస్తఫా అల్‌ హౌసవి ఉన్నారు. అల్‌ఖైదాకు చెందిన మొత్తం 19 మంది సభ్యులు 2001 సెప్టెంబర్‌ 11వ తేదీన అమెరికాలో నాలుగు విమానాలను హైజాక్‌ చేసి రెండింటిని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పైన, ఒకటి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌పైన కూల్చడంతోపాటు మరో దానిని పెన్సిల్వేనియాలో నేల కూల్చారు. ఈ ఘటనల్లో మొత్తం 3వేల మంది చనిపోయినట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.  
 

మరిన్ని వార్తలు