అమ్మో.. బొమ్మ..

31 Aug, 2015 02:56 IST|Sakshi
అమ్మో.. బొమ్మ..

 ఈ బొమ్మలను చూశారా? ఇవి మామూలు బొమ్మలు కావు.. ఎందుకంటే.. ఇవి తింటాయి.. స్నానం చేస్తాయి.. చివరకు తమ తోబుట్టువులతో కలసి స్కూల్‌కు కూడా వెళ్తాయి. అదెలా.. ఇదిగో ఇలా..
 
 పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌లో ఫాన్ అనే గిరిజన తెగ. ఈ తెగలో కవలలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వారికి అనేక శక్తులుంటాయని నమ్ముతారు. అదే సమయంలో ఈ తెగలో కవలల పుట్టుక కూడా ఎక్కువే. ప్రతి 20 కాన్పుల్లో ఒకరికి కవలలే. అదే సమయంలో చిన్నవయసులో వచ్చే వ్యాధులు, మలేరియా వల్ల శిశు మరణాల రేటు కూడా ఎక్కువే. అయితే.. అసలు కథ మొదలయ్యేది ఇక్కడే. చిన్నవయసులో కవలలు మరణించినప్పుడు ఇలా వారి బొమ్మలు తయారుచేస్తారు. అంతేకాదు.. వాళ్లు నిజంగానే బతికున్నట్లు భావిస్తూ.. ఆ బొమ్మలను పెంచుతారు. వాటికి స్నానం చేయిస్తారు.. ఆహారం పెడతారు.. చివరకు స్కూల్‌కు కూడా పంపుతారు.
 
 ఎందుకంటే.. ఆ బొమ్మల్లో చనిపోయిన కవలల తాలూకు ఆత్మలు ఉంటాయని వారు నమ్ముతారు. బొమ్మలను సరిగా చూసుకోకపోతే.. ఆ కుటుంబానికి నష్టం చేస్తాయని.. బాగా చూసుకుంటే అదృష్టాన్ని తెచ్చిపెడతాయన్నది వారి విశ్వాసం. వాటిని ఏనాడు బొమ్మలుగా భావించరు. బొమ్మలతో ఆటలాడరు. పైగా.. తాము దూరప్రాంతం వెళ్లాల్సి వస్తే.. వాటిని చక్కగా చూసుకోవడానికి స్థానికంగా ‘నర్సరీ’ వంటి ఏర్పాటు కూడా ఉంటుంది. కవలలు మగ పిల్లలు అయితే.. వారిని జిన్‌సౌ అని, ఆడపిల్లలు అయితే జిన్‌హౌ అని పిలుస్తారు. ఈ సంప్రదాయం నిజంగానే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంది కదూ..

మరిన్ని వార్తలు