మా యాప్‌ను నిషేధించ‌డం అన్యాయం : ట్రూకాల‌ర్

9 Jul, 2020 19:35 IST|Sakshi

స్టాక్‌హోమ్ : ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్‌ యాప్‌ ఎంతో ఫేమస్‌. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్‌ ప్రత్యేకత. స్వీడ‌న్‌లోని స్టాక్‌హోమ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ట్రూకాలర్ .. కాలర్ ఐడీ.. స్పామ్ డిటెక్షన్, మెసేజింగ్, ఇతర డయలర్ సేవలను అందిస్తున్నది. తాజాగా చైనాతో స‌రిహ‌ద్దు వివాదం త‌ర్వాత 89 ర‌కాల సోష‌ల్ మీడియా యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని భార‌త్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. వాటిలో ట్రూకాల‌ర్ యాప్ కూడా ఒక‌టి.

దీనిపై ట్రూ కాల‌ర్ యాప్ యాజ‌మ‌న్యం గురువారం  స్పందిస్తూ .. మా యాప్‌ను నిషేధించ‌డం అన్యాయం అని పేర్కొంది. కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ను నిషేధిత దరఖాస్తుల జాబితాలో చేర్చడంపై ఆ సంస్థ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ జాబితాలో ఇప్పటికే ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ వంటి చైనీస్ యాప్ లు మాత్రమే కాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, జూమ్, రెడ్‌డిట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉన్నాయి. జాతీయ భద్రతా సమస్యలపై ఈ యాప్‌లను తొలగించాలని భారత సైన్యం తన సిబ్బందికి సూచించింది.

'తమ సిబ్బంది కోసం భారత ఆర్మీ నిషేధించిన 89 యాప్ ల జాబితాలో ట్రూకాలర్ ఉన్నదని తెలుసుకుని నిరాశకు గురయ్యాం. ఇది చాలా అన్యాయం. ట్రూకాలర్ అనేది స్వీడన్‌ కేంద్రంగా ప‌ని చేస్తున్న యాప్‌.ట్రూకాలర్ యాప్ ను నిషేధిత యాప్ ల జాబితాలో ఉంచాడానికి ఎలాంటి కారణాలు లేవు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తాం. ట్రూకాలర్ ఇండియాలో 170 మిలియన్లకు పైగా ప్రజలకు కీలకమైన సేవలను అందిస్తున్నది. నిత్యం వందల మిలియన్ల స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించి బ్లాక్ చేస్తుంది' అని ట్రూకాలర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు