అధ్యక్షుడి మాట అమలవ్వాలా?

9 Feb, 2017 04:40 IST|Sakshi
అధ్యక్షుడి మాట అమలవ్వాలా?

ట్రంప్‌ వీసారద్దు నిర్ణయాన్ని ప్రశ్నించిన శాన్‌ ఫ్రాన్సిస్కో కోర్టు
న్యాయస్థానంలో జడ్జీలు, ట్రంప్‌ ప్రతినిధి మధ్య వాగ్వాదం
తీర్పు వాయిదా.. కొనసాగనున్న సియాటెల్‌ కోర్టు ఉత్తర్వులు  


శాన్‌ ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకొచ్చిన వలసల రద్దు (ఏడు ముస్లిం మెజారిటీ దేశాలనుంచి వలసలను తాత్కాలికంగా నియంత్రించేందుకు) ఆదేశాలపై సియాటెల్‌ కోర్టు విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేసేందుకు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ తిరస్కరించింది. గంటసేపు ఫోను ద్వారా ప్రభుత్వాధికారులను విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ‘అసలు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? ముస్లింలపై విపక్ష చూపటం రాజ్యాంగ విరుద్ధం కాదా? జాతీయ భద్రత కారణంతో నిర్ణయం తీసుకున్నామనటంలో ఆంతర్యమేంటి? అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే అమలైపోవాలా?’ అని ప్రశ్నించింది. తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో ప్రస్తుతానికి అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలపై సియాటెల్‌ కోర్టు విధించిన నిషేధం కొనసాగనుంది.

ఆధారాలున్నాయా?
అమెరికన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై సియాటెల్‌ కోర్టు తీర్పును రద్దుచేయాలనిప్రభుత్వం తరపు న్యాయవాది ఆగస్ట్‌ ఫ్లెంటిజ్‌ ధర్మాసనానికి విన్నవించారు. దీంతో ధర్మాసనం, ఫ్లెంటిజ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ‘ఆ దేశాలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయా? ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులు సమీక్షించకూడదని వాదిస్తున్నారా?’ అని ప్రశ్నించారు. అటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్‌ సొలిసిటర్‌ జనరల్‌ నోవాహ్‌ పుర్సెల్‌ కోర్టులో తన వాదనలు వినిపించారు.

‘ముస్లింలకు నష్టం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.’ అని అన్నారు. దీనిపై ఫ్లెంటిజ్‌ స్పందిస్తూ.. ‘అధ్యక్షుడి నిర్ణయంపై ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు. కానీ ఓ న్యాయమూర్తి అధ్యక్షుడి ఆదేశాల అమలుపై స్టే విధించటమే సరికాదు’ అని అన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. బుధవారం న్యాయవ్యవస్థపై నేరుగా విమర్శలు చేశారు. ‘కోర్టులు పక్షపాతంగా వ్యవహరిస్తాయని నేను అనను. కానీ దేశభద్రత కోసం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవటంలో రాజకీయ ఉద్దేశం కనబడుతోంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు.   త్వరలోనే ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరే వీలుంది.

ప్రభుత్వ చర్చ సమర్థనీయమే!
అమెరికన్‌ కాంగ్రెస్‌లో జరిగిన చర్చ సందర్భంగా ‘ఆ  దేశాలకు వీసారద్దుపై ఆదేశాలు  రాజ్యాంగబద్ధమైనవే. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు లోబడే ఉంది. దీనిపై జరుగుతున్న న్యాయపోరాటంలో ప్రభుత్వం విజయం సాధిస్తుంది’ అని ఓ అమెరికా అంతర్గ భద్రత కార్యదర్శి జాన్‌ కెల్లీ తెలిపారు. అధ్యక్షుడి ఉత్తర్వుల్లో పేర్కొన్న ఏడు దేశాల్లో రెండింటి పేర్లు ఒబామా ప్రభుత్వం పేర్కొన్న ‘ఆయా దేశాల్లో ప్రభుత్వాల ప్రోద్బలంతోనే ఉగ్రవాదం పెచ్చుమీరుతున్న దేశాలు’ జాబితాలో ఉన్నాయన్నారు. మిగిలిన ఐదు దేశాలు కూడా ఉగ్రవాదం విషయంలో అమెరికా ప్రభుత్వానికి సహకరించలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాగా, తన నిర్ణయంపై నిషేధం విధించిన సియాటెల్‌ జడ్జిపై తీవ్రంగా మండిపడ్డ ట్రంప్‌.. ఆ కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రెస్‌ కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు. ‘కోర్టు తీర్పును అధ్యక్షుడు గౌరవిస్తున్నారు. కోర్టుల్లో తన నిర్ణయమే విజయం సాధిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు