‘హెచ్‌–1బీ’కి సమూల మార్పులు!

20 Oct, 2018 01:50 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్‌–1బీ వీసాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అక్కడి కంపెనీలకు ప్రస్తుతం హెచ్‌–1బీ అవకాశం కల్పిస్తోంది. అయితే ఆ ‘ప్రత్యేక నైపుణ్యాలు’, ‘ఉపాధి’, ‘ఉద్యోగి–యజమాని సంబంధం’ అనే పదాలను పునర్నిర్వచించడం ద్వారా హెచ్‌–1బీ వీసా విధానంలో పూర్తి మార్పులు తీసుకురాబోతున్నట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) తెలిపింది.

వచ్చే ఏడాది జనవరికల్లా అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందంది. హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్‌–4 వీసాదారులకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండగా, హెచ్‌–4 వీసాలకు వర్క్‌ పర్మిట్లను రద్దు చేసేందుకు డీహెచ్‌ఎస్‌ సిద్ధమైంది. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికాలో హెచ్‌–1బీ, హెచ్‌–4 వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నారు. కొత్త నిబంధనలు అమలైతే వీరితోపాటు అక్కడి కంపెనీలు ఇబ్బందులు పడనున్నారు.

మరిన్ని వార్తలు