భారత్‌కు ట్రంప్‌ వాణిజ్య దెబ్బ

2 Jun, 2019 04:30 IST|Sakshi

భారత్‌కు 560 కోట్ల డాలర్ల రాయితీలు రద్దు

జూన్‌ 5 నుంచి అమల్లోకి ‘జీఎస్‌పీ హోదా రద్దు’

వాషింగ్టన్‌: భారత్‌కు కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌–జీఎస్‌పీ)ని ఈ జూన్‌ 5వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దాంతో ఈ హోదా కింద భారత్‌కు అమెరికా నుంచి అందుతున్న సుమారు రూ.39 వేల కోట్ల(560 కోట్ల డాలర్లు) విలువైన వాణిజ్య రాయితీలు రద్దవుతాయి. తన మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులకు సమానమైన అవకాశం కల్పిస్తామని భారత్‌ హామీ ఇవ్వదని అమెరికా నిర్ధారణకు రావడంతో అమెరికా ఈ చర్య తీసుకుంది.

వర్థమాన దేశాల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అమెరికా చాలా ఏళ్ల నుంచి ఈ జీఎస్‌పీ హోదా విధానాన్ని అమలు పరుస్తోంది. ఈ హోదా పొందిన దేశాల నుంచి అమెరికా ఎలాంటి సుంకాలు విధించకుండా వేలాది ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది.‘భారత్‌ తన మార్కెట్లలో అమెరికాకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పి స్తామని హామీ ఇవ్వదని నేను నిర్ధారణకొచ్చా. అందుకే భారత్‌కు కల్పించిన జీఎస్‌పీ హోదాను రద్దుచేస్తున్నాం’ అని ట్రంప్‌ అన్నారు. కాగా, తమకు జీఎస్‌పీ హోదాను రద్దు చేసినప్పటికీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి అమెరికాతో కలిసి పని చేస్తూనే ఉంటామని భారత్‌ పేర్కొంది.

అమెరికా చర్యపై స్పందిస్తూ భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. జీఎస్‌పీ హోదా కింద భారత్‌ దాదాపు 2వేల ఉత్పత్తులను అమెరికాకు ఎలాంటి సుంకాలు చెల్లించకుండా ఎగుమతి చేసేది. ఈ హోదా కింద అమెరికా 2017లో 570 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్‌ నుంచి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంది. హోదా పొందాలంటే అమెరికా కంపెనీలు, పౌరులకు అనుకూలంగా వచ్చే మధ్యవర్తిత్వ తీర్పులను గౌరవించడం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్మిక హక్కులను గౌరవించడం,మేథో హక్కులను పరిరక్షించడం, అమెరికా కంపెనీలకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పించడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

>
మరిన్ని వార్తలు