జపాన్‌ మీదుగా ఉ.కొరియా క్షిపణి

30 Aug, 2017 01:29 IST|Sakshi
జపాన్‌ మీదుగా ఉ.కొరియా క్షిపణి

► తమ దేశానికి తీవ్ర ముప్పుగా పరిగణిస్తున్నాం: జపాన్‌ ప్రధాని అబే
► ఉ.కొరియాపై చర్యలకు అన్ని అంశాలు పరిశీలిస్తున్నాం: ట్రంప్‌


సియోల్‌: అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని ఉత్తర కొరియా మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడింది. ఇప్పటికే వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న ఉత్తర కొరియా తాజాగా మంగళవారం ఉదయం జపాన్‌ మీదుగా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. జపాన్‌ మీదుగా ప్రయాణించిన ఈ క్షిపణి ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో పడింది. దీనిపై జపాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

క్షిపణి ప్రయాణించే మార్గమైన ఉత్తర జపాన్‌ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై జపాన్‌ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. ఇటువంటి క్షిపణి ప్రయోగాలు తమ దేశానికి తీవ్ర ముప్పుగా పరిగణిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జపాన్, అమెరికాలు ఐక్యరాజ్యసమితిని కోరాయి.

ఉత్తర కొరియాలోని సునన్‌ ప్రాంతం నుంచి ఆ దేశం తాజా ప్రయోగాన్ని చేపట్టినట్లు దక్షిణ కొరియా తెలిపింది. 2,700 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ క్షిపణి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను ఛేదించగలదని ద.కొరియా వెల్లడించింది. ఉ.కొరియాపై ఒత్తిడిని తీవ్రతరం చేసేలా అమెరికా, జపాన్‌లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఉ.కొరియా చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తర కొరియాపై చర్యలు తీసుకునేందుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని ఆ దేశాన్ని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు