కిమ్‌తో చర్చలకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌

9 Mar, 2018 09:54 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా, ఉత్తర కొరియా మధ్య  దీర్ఘకాలంగా నెలకొన్న వివాదం సమసిపోయే సంకేతాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో చర్చలకు మార్గం సుగమమైంది.  ట్రంప్‌ని చర్చలకు ఆహ్వానిస్తూ గురువారం వైట్‌ హౌస్‌ని సందర్శించిన దక్షిణ కొరియా ప్రతినిధులు కిమ్‌ పంపిన లేఖను అందజేశారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న చర్చల సారాంశాన్ని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ట్రంప్‌ ట్వీటర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. కిమ్‌తో దక్షిణ కొరియా ప్రతినిధులు, అణు క్షిపణుల నియంత్రణకు జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్‌ తెలిపారు.  ఉత్తర కొరియా ఇటీవల క్షిపణి పరీక్షలకు దూరంగా ఉండటాన్ని ఆయన స్వాగతించారు. ఒప్పందాలు కుదిరే వరకు ఇది ఇలాగే కొనసాగాలన్నారు. సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ట్రంప్‌, కిమ్‌ల మధ్య మేలో ముఖాముఖీ భేటీ జరిగే అవకాశం ఉంది.

ప్రపంచానికి పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికాకు, నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కొరకరాని కొయ్యలా తయారయిన విషయం తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్‌, కిమ్‌ల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. కిమ్‌ ఏ మాత్రం తగ్గకుండా తమ అణు క్షిపణులతో ప్రపంచానికే పెను సవాలు విసురుతూ వచ్చారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ శాంతి చర్చల ద్వారా వివాదానికి తెర దించాలని ఇరు దేశాలకు సూచించాయి.  దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి కిమ్‌ వైఖరిలో మార్పు చోటుచేసుకుంది. ఉప్పూనిప్పుగా ఉన్న ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు సడలాయి. ఇటీవలే పొరుగు దేశమైన దక్షిణ కొరియా అధికారులు చర్చల కోసం దశాబ్ధ కాలం తర్వాత ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే కిమ్‌ సోదరి దక్షిణ కొరియాలో జరిగిన ఒలంపిక్స్‌కి హాజరవ్వడంతో, చర్చలు సత్ఫాలితాలు ఇచ్చే సంకేతాలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు