వాణిజ్య యుద్ధానికి బ్రేక్‌

30 Jun, 2019 04:12 IST|Sakshi
సదస్సు సందర్భంగా జిన్‌పింగ్, ట్రంప్‌ కరచాలనం

వాణిజ్య చర్చ పున:ప్రారంభం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌–చైనా అధినేత జిన్‌ పింగ్‌ నిర్ణయం

బీజింగ్‌/ఒసాకా: అమెరికా–చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు అంగీకరించారు. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా శనివారం సమావేశమైన ఇరువురు నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం పరిష్కారమయ్యేవరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్‌ ప్రకటించారు.

‘చైనాతో శత్రుత్వం లేదు. అమెరికా–చైనాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్నా’ అని ట్రంప్‌ చెప్పినట్లు చైనా అధికార పత్రిక ‘చైనా డైలీ’ తెలిపింది. వాణిజ్య లోటుపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల కమిటీలు త్వరలో సమావేశమవుతాయని వెల్లడించింది. ట్రంప్‌తో భేటీ  సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పందిస్తూ..‘పరస్పరం సహకరించుకుంటే అమెరికా–చైనాలు లబ్ధి పొందుతాయి. కానీ గొడవలకు దిగితే ఇరుపక్షాలూ నష్టపోతాయి’ అని చెప్పినట్లు చైనా డైలీ పేర్కొంది.

అమెరికాతో ఉన్న 539 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించాలని ట్రంప్‌ గతంలో చైనాను డిమాండ్‌ చేశారు. అలాగే అమెరికా కంపెనీల మేధోపరమైన హక్కులను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు చెందిన వాణిజ్య బృందాలు పలుమార్లు సమావేశమైనప్పటికీ సత్ఫలితాలు రాలేదు. దీంతో 250 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై 25 శాతం మేర సుంకాలను పెంచుతూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై చైనా సుంకాలు విధించింది. అయితే ఈ వాణిజ్య యుద్ధం కారణంగా తమకు నష్టం జరుగుతోందని గుర్తించిన ఇరుదేశాలు తాజాగా సయోధ్యకు ముందుకొచ్చాయి.  

హలో చెప్పాలని ఉంది
‘మీ ఇంటికొస్తా. మీ భూభాగంలో అడుగు పెడతా. హలో అని పలకరిస్తా. కరచాలనం చేస్తా. రెండు నిమిషాలు మాట్లాడినా చాలు’ అని ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌కి ట్విట్టర్‌ ద్వారా సందేశం పంపారు.  ట్రంప్‌ ట్విట్టర్‌లో చర్చలకు రమ్మంటూ కిమ్‌ని ఆహ్వానించడంతో రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. 

మరిన్ని వార్తలు