ఉత్తర కొరియాకు ఊహించని షాక్‌

24 Feb, 2018 12:55 IST|Sakshi
ట్రంప్‌-కిమ్‌ జోంగ్‌ ఉన్‌

వాషింగ్టన్‌ : ఉత్తర కొరియాకు ఊహించని దెబ్బ తగిలింది. కొంత కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఉత్తర కొరియాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. 

శుక్రవారం నిర్వహించిన నిపుణుల సంఘం భేటీలో ట్రంప్‌ ప్రసంగిస్తూ.. ‘ఈ రోజు నేను కీలక ప్రకటన చేస్తున్నా. ఉత్తర కొరియాపై ఎవరూ ఊహించని రీతిలో అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తోంది’ అని ప్రకటించారు. ఖజానా శాఖ ఈ మేరకు చర్యలు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. నౌకాయానానికి సంబంధించిన వాటితో పాటు మొత్తం 50 కంపెనీలపై ఆంక్షలు అమలు కానున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ కూతురు, వ్యక్తిగత సలహాదారు ఇవాంక ట్రంప్‌ కొరియా ప్రతినిధులతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం.

క్షిపణి పరీక్షలతో కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌పై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. తాజా ఆంక్షలు ఉత్తర కొరియా మిలిటరీ, అణు పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

మరిన్ని వార్తలు