భారత్‌కు ట్రంప్ చేరువయ్యే అవకాశం

7 Dec, 2016 01:31 IST|Sakshi
భారత్‌కు ట్రంప్ చేరువయ్యే అవకాశం

చైనాను కట్టడి చేసేందుకు ప్రయత్నం: చైనా మీడియా
- దీని ప్రభావం చైనాపై తక్కువే అని విశ్లేషణ
 
 బీజింగ్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంలో భారత్-అమెరికా సంబంధాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చైనా మీడియా పేర్కొంది. చైనాను కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్‌కు దగ్గరయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. అరుుతే దీని ప్రభావం చైనాపై పెద్దగా ఉండబోదని, అలాగే స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న భారత్ కూడా అమెరికాతో కలిసే అవకాశాలు తక్కువే అని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ‘ట్రంప్ దౌత్య విధానంలో భారత్-అమెరికా సంబంధాలు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. విదేశాంగ విధానాన్ని పటిష్టపరుచుకోవడానికి.. స్వదేశంలో సమస్యల నుంచి బయటపడేందుకు ట్రంప్ పాలనా యంత్రాంగం భారత్‌తో సంబంధా లు మరింత మెరుగు పరుచుకునేందుకు యత్నించవచ్చు’ అని గ్లోబల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

‘స్వదేశంలోని సమస్యల కారణంగా భారత్ అమెరికా ఇబ్బందుల విషయంలో తక్కువగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. దీంతో ట్రంప్ పాలనా యంత్రాంగం భారత్-అమెరికా సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కుదరకపోవచ్చు. దీనివల్ల భారత్‌తో పాక్షిక కూటమి నిర్మించాలన్న అమెరికా ప్రయత్నం ఫలించకపోవచ్చు’’ అని వెల్లడించింది. వాతావరణ మార్పులు, అణ్వాయుధాల నియంత్రణ, ఉగ్రవాదం వంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్ మద్దతు అవసరమని, అరుుతే ఇందులో కొన్నింటికే అమెరికా ప్రాధాన్యమి చ్చే అవకాశం ఉందంది. దీనివల్ల అమెరికాపై భారత్‌కు నమ్మకం తగ్గుతుందని, అలాగే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయని పేర్కొంది. వీటివల్ల భారత్‌తో అమెరికా సంబంధాల ప్రభావం చైనాపై తక్కువగా ఉంటుందని విశ్లేషించింది.