అమెరికాలో ఎమర్జెన్సీ

15 Mar, 2020 04:24 IST|Sakshi
నో షేక్‌: షేక్‌ హ్యండ్‌ బదులు మోచేతులు తాకించి పలకరించుకుంటున్న ట్రంప్, ఎల్‌హెచ్‌సీ అధికారి బ్రూస్‌

ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్‌

వ్యాధి నియంత్రణకు భారీ ఎత్తున నిధులు

పరిస్థితి క్షీణించవచ్చునని హెచ్చరిక

వాషింగ్టన్‌: వైరస్‌ విస్తృతి నేపథ్యంలో తమ దేశంలో అత్యవసర పరిస్థితిని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కరోనా కారణంగా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో వ్యాధి నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయి. వైరస్‌ కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 5,700మందికిపైగా మరణించగా, 137 దేశాల్లో 1.51లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. అమెరికాలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

సుమారు రెండు వేల మంది కోవిడ్‌ బారిన పడ్డారు. ‘పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది’ అని వైట్‌హౌస్‌లో ట్రంప్‌ మీడియాతో చెప్పారు. ప్రభుత్వం ఈ వ్యాధిపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు వీలుగా నేషనల్‌ ఎమర్జెన్సీని విధించినట్లు ప్రకటించారు. అమెరికా చట్టాల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా భారీ ఎత్తున నిధులు అందుతాయి. దేశంలోని అన్ని ఆసుపత్రులు అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.

అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అమెరికా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రికి విశేష అధికారులు లభిస్తాయి. వైద్యులు, ఆసుపత్రులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్‌ చికిత్సకు సంబంధించి తగిన చర్యలు తీసుకునేందుకు వెసలుబాటు లభిస్తుంది. ప్రజలందరికీ వైద్యసేవలు అందించేందుకు వీలుగా అన్ని అడ్డంకులను తొలగిస్తున్నట్లు ట్రంప్‌ విలేకరులతో చెప్పారు. ముడిచమురు ధరలు తగ్గివస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక నిల్వలను భారీగా పెంచాలని ట్రంప్‌ అధికారులను ఆదేశించారు.

పరీక్షలు చేయించుకున్నా: ట్రంప్‌
వ్యాధి లక్షణాలేవీ లేకున్నా... తాను కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల కోసం వేచిచూస్తున్నానని ట్రంప్‌  తెలిపారు. తనను కలసిన బ్రెజిల్‌ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ ఫాబియో వాజ్న్‌గార్టేన్‌కు వైరస్‌ సోకిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ విషయం చెప్పారు.

► వైరస్‌ నేపథ్యంలో ఇటలీ వీధులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వారాంతపు రోజైన శనివారం రోమ్‌లో ఖాళీ వీధులు, మూసివేసిన దుకాణాలే దర్శనమిచ్చాయి. ఇటలీలో 17,660 మంది కోవిడ్‌ బారిన పడటం, 1226 మంది మరణించారు. ప్రధాని గుసెపీ కాంటే శుక్రవారం వ్యాపారవేత్తలతో, సంఘాలతో భేటీ అయ్యారు. దేశం స్తంభించిపోలేదని, ఉద్యోగాలు చేసుకునే వారికి రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.

► కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మరిన్ని మాస్కులు, మందులు పంపాల్సిందిగా ప్రధాని మోదీని కోరినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ తెలిపారు.

► ఆఫ్రికా దేశం రువాండాలో ఒక భారతీయుడు కోవిడ్‌ బారిన పడ్డాడు. ముంబై నుంచి మార్చి 8న కిగాలికి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌ సోకిందని రువాండా ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

► స్పెయిన్‌లో శుక్ర, శనివారాల మధ్య సుమారు 1500 మంది కరోనా బారినపడ్డారు. ఈ కొత్త కేసులతో ఇటలీ తరువాత అత్యధిక (5753) కేసులున్న దేశంగా స్పెయిన్‌ మారింది. స్పెయిన్‌లో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా 136 మంది మరణించారు. వారం రోజుల్లో పదిరెట్లు పెరిగిన రోగబాధితులను దృష్టిలో ఉంచుకుని దేశం మొత్తమ్మీద నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రధాని పెడ్రో శాంచెజ్‌ సిద్ధమవుతున్నారు.
 

► కోవిడ్‌పై పోరాడేందుకు దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్‌) ఏర్పాటు చేస్తున్న సమావేశం మన పౌరులకు ఉపయోగపడే ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ప్రధాని ఈ భేటీని నడిపించనున్నారు.  మోదీ నాయకత్వంలో ఈ భేటీ సాగేందుకు శ్రీలంక అధ్యక్షుడు గోతబయ రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహిమ్‌ మొహమ్మద్‌ సోలిహ్, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్‌ ప్రీమియర్‌ లోతయ్‌ షెరింగ్, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వాలు అంగీకరించాయి. చివరగా పాకిస్తాన్‌ కూడా దీనికి అంగీకరించింది.

ఇరాన్‌లో ఒక్కరోజే 97మంది బలి
► కరోనా మహమ్మారికి ఇరాన్‌లో శనివారం ఒక్కరోజే సుమారు 97 మంది బలి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 611కు చేరుకుందని, 12,729 మంది వ్యాధి బారిన పడ్డారని ఇరాన్‌ అధికార టెలివిజన్‌ ఛానెల్‌ ప్రకటించింది. చైనా, ఇటలీల తరువాత ఇరాన్‌లోనే అత్యధిక సంఖ్యలో కోవిడ్‌ బాధితులున్నారు.

► చైనాలో మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. తాజాగా శుక్రవారం చైనా మొత్తమ్మీద 13 మంది కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోగా కొత్తగా వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 11గా ఉంది. నిర్ధారిత కేసుల సంఖ్య 80,8254కు చేరుకున్నట్లు ఆరోగ్య కమిషన్‌ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ చైనాలో 3,189 మంది కోవిడ్‌ కారణంగా మరణించారు. 

మరిన్ని వార్తలు