చెత్త దేశాల పౌరులు మాకెందుకు?

13 Jan, 2018 02:10 IST|Sakshi

ఆఫ్రికా, హైతీ వలసదారులపై ట్రంప్‌ జాతివిద్వేష వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: నోటి దురుసుకు కేరాఫ్‌గా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నోరుజారారు. హైతీ, ఎల్‌సాల్వడార్‌లతో పాటు ఆఫ్రికాలోని అత్యంత చెత్త(షిట్‌ హోల్‌) దేశాల పౌరుల్ని అమెరికాలోకి ఎందుకు అనుమతించాలని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడిక్కడి ఓవల్‌ కార్యాలయంలో రిపబ్లికన్, డెమొక్రటిక్‌ పార్టీల సెనెటర్లతో సమావేశమైన ట్రంప్‌ ఈ మేరకు స్పందించారు. దీంతో ట్రంప్‌ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్‌ యూనియన్‌తో పాటు ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్‌ ఎట్టకేలకు స్పందించారు. హైతీ, ఎల్‌సాల్వడార్, ఆఫ్రికా దేశాలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ట్రంప్‌ తెలిపారు. డీఏసీఏ సమావేశంలో తాను సీరియస్‌ కామెంట్స్‌ మాత్రమే చేశానని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ కల్పిస్తున్న పౌరుల జాబితా నుంచి హైతీ దేశస్తుల్ని తొలగించాలని తాను ఆదేశించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్వీటర్‌లో తెలిపారు. ఇదంతా డెమొక్రటిక్‌ పార్టీ సభ్యులు చేసిన కుట్రనీ, భవిష్యత్‌లో అన్ని సమావేశాలను రికార్డు చేస్తామని వెల్లడించారు.

ఓవల్‌ కార్యాలయంలో గురువారం ఇరుపార్టీల సెనెటర్లతో సమావేశమైన ట్రంప్‌.. బాల్యంలో అమెరికా వచ్చినవారిపై చర్యల వాయిదా(డీఏసీఏ) బిల్లును తిరస్కరించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు హైతీ, ఎల్‌సాల్వడార్‌తో పాటు ఆఫ్రికా దేశాల పౌరుల రక్షణ కోసం పోరాడటంపై ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మన దేశంలో అత్యంత చెత్త(షిట్‌ హోల్‌) దేశాలకు చెందిన పౌరులంతా ఎందుకున్నారు? వీరందరినీ అసలు ఎందుకు అనుమతించాలి? అమెరికా ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చే కొన్ని ఆసియా దేశాలతో పాటు నార్వే నుంచి వలసల్ని ప్రోత్సహించండి’ అని వారితో ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు పలు అమెరికన్‌ పత్రికలు గురువారం వార్తలు ప్రచురించాయి.

లండన్‌లో ఎంబసీని ప్రారంభించను
లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఫిబ్రవరిలో బ్రిటన్‌ వెళ్లాల్సిన ట్రంప్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘ఒబామా ప్రభుత్వం లండన్‌లో కీలకమైన మేఫైర్‌లో ఉన్న అమెరికా ఎంబసీని చిల్లరకు అమ్మేసి 1.2 బిలియన్‌ డాలర్లతో ఎక్కడో మారుమూలన నైన్‌ ఎల్మస్‌లో ఎంబసీని నిర్మించింది’ అని ట్రంప్‌ వరుస ట్వీట్లు చేశారు.

ట్రంప్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఐరాస
ఆఫ్రికా దేశాలపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఐరాస మానవహక్కుల కార్యాలయం అధికార ప్రతినిధి రూపర్ట్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.. ట్రంప్‌ వ్యాఖ్యలతో అమెరికాలోని వలసదారులు, మైనారిటీలపై దాడులు పెరిగే ప్రమాదముందన్నారు. ఆఫ్రికన్‌ యూనియన్‌(ఏయూ) ట్రంప్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది.

కాగా, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో పలు ఆఫ్రికా దేశాలు ఈ విషయంలో స్పందించేందుకు నిరాకరించాయి. అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్‌ పార్టీ విప్‌ హోయర్‌ స్పందిస్తూ..‘జాత్యహంకారంతో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నాయ్‌. ఓ అమెరికన్‌గా సిగ్గుపడుతున్నాను’ అని అన్నారు.

మరిన్ని వార్తలు