ట్రంప్‌ పరిపాలనకు ఊహించిన రేటింగ్‌

29 Dec, 2017 12:13 IST|Sakshi

తొలి ఏడాది పనితీరుపై 53 శాతం అసమ్మతి

ట్విట్టర్‌లో మరోసారి చైనా, ఉత్తరకొరియాలపై మండిపడ్డ ప్రెసిడెంట్‌

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పనితీరుపై భారీ ఎత్తున అసమ్మతి వెల్లువెత్తింది. పదవి చేపట్టిన తొలినాళ్లలో ఆయనకు లభించిన మద్దతు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రఖ్యాత సర్వే సంస్థ ‘రాస్మెస్సన్‌ రిపోర్ట్స్‌’.. ట్రంప్‌ తొలి ఏడాది పాలనపై నిర్వహించిన ఓటింగ్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్‌ మొదటి ఏడాది పనితీరుకు 53 శాతం అసమ్మతి రాగా, కేవలం 46 శాతం మాత్రమే ఆమోదం లభించింది. తన ఏడాది పాలనలో వీసా, వర్క్‌ పర్మిట్ల కోతలు మొదలు ఇస్లామిక్‌ దేశాలపై ఆంక్షలు, కొరియాతో యుద్ధ సన్నాహాలు లాంటి సంచలన నిర్ణయాలెన్నో ట్రంప్‌ తీసుకున్న సంగతి తెలిసిందే.

2017 జనవరి 20న ట్రంప్‌ అధ్యక్ష కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పుడు 56 శాతంగా ఉన్న అప్రూవల్‌ రేటింగ్‌.. క్రమంగా తగ్గుతూ ఆగస్టు నాటికి కనిష్టంగా 38 శాతానికి చేరింది. డిసెంబర్‌ 28 నాటికి ట్రంప్‌ పెర్మార్మెన్స్‌ అప్రూవల్‌ రేటింగ్‌ 46శాతంగా ఉందని రాస్మెన్సన్‌ సర్వేలో వెల్లడైంది. అమెరికా అధ్యక్ష సమకాలీన చరిత్రలో ఇంత తక్కువ రేటింగ్‌ పొందింది ట్రంప్‌ ఒక్కరేనని ‘డెయిలీ మెయిల్‌’ పేర్కొంది.

చైనా, కొరియాలపై మండిపాటు : కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాకు ఇప్పటికే లెక్కలేనన్ని హెచ్చరికలు చేసిన అమెరికా తాజాగా మరో వార్నింగ్‌ ఇచ్చింది. అంతర్జాతీయ సమాజం అభ్యర్థనను పక్కనపెట్టి మరీ ఉత్తరకొరియాకు ఆయిల్‌ సరఫరా చేస్తోన్న చైనాపై ట్రంప్‌ మండిపడ్డారు. ‘‘చైనా ఇంకా ఉత్తరకొరియాకు ఆయిల్‌ సరఫరా చేస్తుండటం బాధాకరం. ఇలాంటి చర్యలు.. స్నేహపూర్వక పరిష్కారాలకు విఘాతం కలిగిస్తాయి’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు