డబ్ల్యూహెచ్‌వో సిగ్గుపడాలి

2 May, 2020 02:31 IST|Sakshi

 చైనాకు పీఆర్‌గా పనిచేస్తోంది 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు  

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ దాటికి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై విమర్శల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరింత తీవ్రతరం చేశారు. చైనాకు పబ్లిక్‌ రిలేషన్‌ ఏజెన్సీగా డబ్ల్యూహెచ్‌వో వ్యవహరిస్తోందని, అందుకు ఆ సంస్థ సిగ్గుపడాలన్నారు.

గురువారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌పై ప్రపంచదేశాలను అప్రమత్తం చేయకుండా లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణభూతమైన డబ్ల్యూహెచ్‌ఒని క్షమించకూడదని అన్నారు. అమెరికా ఏడాదికి 50 కోట్ల డాలర్లు ఇస్తే, చైనా వారికి 3.8 కోట్ల డాలర్ల నిధులు ఇస్తోందని అయినప్పటికీ ఆ సంస్థ చైనాకు పీఆర్‌గా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఇప్పటికే అమెరికా డబ్ల్యూహెచ్‌వోకి నిధులు నిలిపివేసింది.

వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌  
చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ బయటకి వచ్చి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిందని ట్రంప్‌ మరోసారి ఆరోపించారు. ఈ విషయంలో సమగ్రమైన విచారణ జరుగుతోందని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఆయన నిరాకరించారు. కరోనా వైరస్‌ మానవ సృష్టి కాదని అమెరికా ఇంటెలిజెన్స్‌ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్‌ ఈ ఆరోపణలు దిగారు. వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ వచ్చిందని మీరు విశ్వసిస్తున్నారా అన్న విలేకరి ప్రశ్నకు బదులిచ్చిన ట్రంప్‌ ‘అవును అవును.

నేను అదే నమ్ముతున్నాను’’అని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదికను బయట పెడతామని అన్నారు. చైనా నుంచే వచ్చిన ఈ వైరస్‌ విస్తరించకుండా ఆ దేశం కట్టడి చేసి ఉండాల్సిందని, ప్రపంచమంతా అదే అంటోందని అన్నారు. కరోనా మానవుడు సృష్టించిన జీవాయుధం కాదని, అయితే అది వైరాలజీ ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తూ బయటపడిందా ? జంతువుల నుంచి మనుషులకి సంక్రమించిందా అన్నది తేలాల్సి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

చైనాలో జరుగుతున్న పరిశోధనలు
కరోనా వైరస్‌ ఎలా బయటపడిందన్న అంశంపై చైనాలో కూడా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. చైనా వెట్‌ మార్కెట్‌ నుంచే వచ్చిన ఈ వైరస్‌ ఎలా మనుషులకు సంక్రమించిందో జరుగుతున్న పరిశోధనల్లో భాగస్వామ్యం కావడానికి చైనా ప్రభుత్వం తమను  ఆహ్వానిస్తుందని ఆశించినట్టు డబ్ల్యూహెచ్‌వో అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.  
► అమెరికాలో కోవిడ్‌–19తో 24 గంటల్లో రెండు వేలకు పైగా మరణించారు.  
► కోవిడ్‌ నుంచి అమెరికా కోలుకోవాలంటే వ్యాక్సిన్‌ రావడం ఒక్కటే మార్గమని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ అన్నారు.   
► పాకిస్తాన్‌ పార్లమెంటు స్పీకర్‌ కైజర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. రంజాన్‌ని పురస్కరించుకొని ఆయన ఈ వారం మొదట్లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఇతర ఉన్నతాధికారుల్ని కూడా పలుమార్లు కలుసుకున్నారు. ఇప్పుడు ఆయనకు కరోనా సోకడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది
.

మరిన్ని వార్తలు