గల్ఫ్‌కి మరిన్ని అమెరికా బలగాలు

22 Sep, 2019 04:08 IST|Sakshi

ఇరాన్‌పై యుద్ధం చేసే ఉద్దేశం లేదన్న ట్రంప్‌  

వాషింగ్టన్‌/టెహ్రాన్‌: గల్ఫ్‌ ప్రాంతానికి మరిన్ని బలగాలు పంపుతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడులు ఇరాన్‌ పనేనని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరిన్ని బలగాలు పంపించడానికి నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌పై అమెరికా తీవ్రమైన ఆర్థిక ఆంక్షల్ని విధించిన కొద్ది గంటల్లోనే బలగాలను పంపాలని నిర్ణయించడంతో భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయన్న ఆందోళన నెలకొంది.

గత జూన్‌లో అమెరికా నిఘా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేసిన దగ్గర్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో కీలక చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడులతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. ఇందుకు ఇరానే కారణమని నమ్ముతున్న అమెరికా ఆ దేశంపై గుర్రుగా ఉంది. అమెరికా ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతోందని విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలకు బదులిచ్చిన ట్రంప్‌ ఇప్పటికిప్పుడే ఇరాన్‌లో 15 కీలక ప్రాంతాలను ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని కానీ ఆ దేశంపై యుద్ధానికి దిగే ఉద్దేశం లేదన్నారు.

రణరంగంగా మారుస్తాం: ఇరాన్‌  
గల్ఫ్‌ ప్రాంతంలో బలగాలను మోహరించాలన్న అమెరికా ఆదేశాలపై ఇరాన్‌ స్పందించింది. తమపై దాడికి దిగే దేశాలను యుద్ధక్షేత్రాలుగా మారుస్తామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ హొస్సైన్‌ సలామీ హెచ్చరించారు. ‘తమ దేశాన్ని ప్రధాన యుద్ధక్షేత్రంగా మార్చాలనుకుంటే అలాగే కానివ్వండి. మా భూభాగాన్ని ఆక్రమించుకోవడాన్ని అడ్డుకుని తీరుతాం. వాళ్లు మరోసారి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడతారని అనుకోవడం లేదు’అని అమెరికానుద్దేశించి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు