అమెరికా డిగ్రీలకు ‘హెచ్‌1బీ’లో ప్రాధాన్యత

1 Feb, 2019 03:54 IST|Sakshi

వాషింగ్టన్‌: నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అమెరికా జారీచేస్తున్న హెచ్‌1బీ వీసా నిబంధనల్లో ట్రంప్‌ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అమెరికాలో మాస్టర్‌ డిగ్రీలు చదివిన విదేశీ విద్యార్థులకే ఇకపై హెచ్‌1బీ వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.  భారత్, చైనా వంటి దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాలనుకునే ఐటీ నిపుణులపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. యూఎస్‌సీఐఎస్‌ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఏటా 65 వేల హెచ్‌1బీ దరఖాస్తులను జారీచేస్తున్నారు.

అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించే విదేశీయుల కోసం మరో 20 వేల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అయితే, హెచ్‌1బీ వీసా ప్రక్రియలో మార్పులతో 65 వేల వీసాల్లో కూడా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన విదేశీ విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ కొత్త నిర్ణయం 2019, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటి నుంచే దరఖాస్తులను స్వీకరిస్తామని యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ సిస్నా తెలిపారు. దీనివల్ల ఏటా అమెరికాలో మాస్టర్స్‌ చేసిన 5,340 మంది విదేశీయులు అదనంగా లబ్ధి పొందుతారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు