అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట

16 Jul, 2020 03:42 IST|Sakshi

దేశం వీడి వెళ్లాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గిన ట్రంప్‌ సర్కార్‌

వాషింగ్టన్‌: అమెరికాలో ఎఫ్‌–1, ఎం–1 వీసాలపై చదువుకుంటున్న భారతీయులు సహా విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని ట్రంప్‌ సర్కార్‌ వెనక్కి తీసుకుంది. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హార్వర్డ్‌ యూనివర్సిటీ, మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం మసాచూసెట్స్‌లోని అమెరికా జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అంతకు ముందే ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ట్రంప్‌ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఈ విషయాన్ని న్యాయమూర్తి అలిసన్‌ బరో న్యాయస్థానంలో వెల్లడించారు. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు దేశం విడిచి వెనక్కి వెళ్లిపోవాలంటూ ఈ నెల 6న ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. కోవిడ్‌–19 అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ యూనివర్సిటీలు ఆన్‌లైన్‌ క్లాసులే నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్వదేశాలకు వెళితే వీసా స్టేటస్‌ కాపాడుకోవడం, రుణాల చెల్లింపు, వేర్వేరు టైమ్‌ జోన్లతో తరగతులకు ఎలా హాజరుకావాలని విద్యార్థులు సతమతమయ్యారు. ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాలో ఉన్న 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.  

వెనకడుగు ఎందుకంటే..
► హార్వర్డ్, ఎంఐటీలకు మద్దతుగా కాలిఫోర్నియా పబ్లిక్‌ కాలేజీలు, మరో 17 రాష్ట్రాలు ట్రంప్‌ సర్కార్‌ని కోర్టుకీ డ్చాయి. వారికి టెక్‌ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌లు మద్దతు పలికాయి. వృత్తివిద్యా కోర్సుల్లో ఇచ్చే శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరమని, అంతిమంగా దేశంలో వాణిజ్య రంగాన్ని బలోపేతం చేస్తాయని టెక్కీ సంస్థలు తేల్చి చెప్పాయి.  

► విద్యాసంస్థల్ని తెరవడం కోసం యూనివర్సిటీలపై ఒత్తిడి పెంచడానికే ట్రంప్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుందంటూ రాజకీయంగానూ ఎదురుదాడి ప్రారంభమైంది. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న చెడ్డ పేరు కూడా వచ్చింది.  

► ఆన్‌లైన్‌ తరగతులపై పరిమితుల్ని ఎత్తివేస్తూనే, మరోవైపు దానికి పూర్తి విరుద్ధంగా ఇలాంటి ఉత్తర్వులు ఐసీఈ ఎలా ఇస్తుందని హార్వర్డ్, ఎంఐటీలు వాదించాయి.  

► అమెరికాలో విదేశీ విద్యార్థులు 10 లక్షలకు పైగా ఉన్నారు. 2018–19లో విదేశీ విద్యార్థుల ద్వారా అగ్రరాజ్యానికి వచ్చిన ఆదాయం 447 కోట్ల డాలర్లుగా ఉంది. విద్యార్థుల్ని వెనక్కి పంపితే అగ్రరాజ్యానికి ఆర్థికంగా కూడా నష్టం కలుగుతుంది.  

► విద్యార్థుల్లో ఎక్కువ మంది చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా దేశానికి చెందినవారు. దీంతో అంతర్జాతీయంగాను ట్రంప్‌ సర్కార్‌ ప్రతిష్ట దిగజారింది.

మరిన్ని వార్తలు